ఇటీవల ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన దొంగలు పట్ట పగలే ఇళ్ళలో జొరబడి దోచుకుపోతున్నారు. మరోపక్క మొబైల్ ఫోన్లు, ఆన్‌లైన్ ద్వారా సైబర్ నేరగాళ్ళు అమాయక ప్రజలను నిలువు దోపిడీ చేసేస్తున్నారు.
కనుక ఇప్పుడు ప్రజలు మరింత అప్రమత్తంగా, సైబర్ నేరాల పట్ల మరింత అప్‌డేట్‌గా ఉండటం చాలా అవసరం... అని నిరూపిస్తోంది హైదరాబాద్, ఎర్రగడ్డలో జరిగిన ఈ ఆన్‌లైన్ మోసం.
ఎర్రగడ్డ రైతుబజారులో సయ్యద్ గౌసుద్దీన్ పండ్ల వ్యాపారి. ఇప్పుడు ఫోన్ పే యాప్ ద్వారా చెల్లింపులు జరుగుతున్నందున ‘ఫోన్ పే క్యూఆర్ కోడ్ కలిగిన స్పీకర్’ కోసం ఆన్‌లైన్‌లో బీఆర్ ఎంటర్‌ప్రైజస్ అనే సంస్థని సంప్రదించాడు.
వారు వెంటనే ఆయన ఫోన్‌కి ఓ క్యూఆర్ కోడ్ పంపించారు. ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ కోసం దానిని స్కాన్ చేసి ఓ రూపాయి పంపిస్తే, క్యూఆర్ కోడ్ కలిగిన స్పీకర్ పంపిస్తామని చెప్పారు. వారు సూచించిన్నట్లే దానిని స్కాన్ చేసి గౌసుద్దీన్ ఓ రూపాయి పంపించాడు.
రెండు నిమిషాల తర్వాత తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.25,000 కట్ అయిన్నట్లు ఆయనకు మెసేజ్ రావడంతో ముందు షాక్ అయ్యాడు. కానీ వెంటనే తేరుకొని సైబర్ క్రైమ్ పోలీస్ ఫోన్ నంబర్: 1930కి ఫోన్ చేసి జరిగింది చెప్పాడు. వారు వెంటనే బ్యాంకుకి సమాచారం ఇచ్చి ఆ మొత్తం సైబర్ నేరగాళ్ళకు చేరకుండా నిలిపివేయించారు.
సయ్యద్ గౌసుద్దీన్ తాను మోసపోయానని తెలిసిన వెంటనే సైబర్ పోలీసులకు సమాచారం ఇవ్వడం వలన పోగొట్టుకున్న ఆ సొమ్ము వెనక్కు తిరిగి వచ్చే అవకాశం ఉంది.
కనుక ప్రతీ ఒక్కరూ ఇటువంటి మోసాల గురించి తెలుసుకుంటూ వారి బారిన పడకుండా తప్పించుకోవడం, మోసపోతే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వడం చాలా ముఖ్యం.