యువ నటులలో నవీన్ చంద్ర విభిన్నమైన కధలు, పాత్రలు, సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆయన చేసిన షో టైమ్ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నవీన్ చంద్ర మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గడానికి ఓటీటీలే కారణమా లేక వేరే కారణాలున్నాయా?అనే ప్రశ్నకు సమాధానం చెపుతూ, “అవును ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గింది. కానీ ఒక్క ఓటీటీలు మాత్రమే కాదు మొబైల్ ఫోన్లలో రకరకాల యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. కనుక చాలా మంది వాటిలో కూడా సినిమాలు చూసి సరిపెట్టేసుకుంటున్నారు.
కనుక ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి సినిమాలలో కధ కంటే సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాలలో కధని ఈ గ్రాఫిక్స్ వగైరా డామినేట్ చేస్తుండటం వలన సినిమాలు దెబ్బ తింటున్నాయి.
ఓటీటీల వలన పెద్ద సినిమాలు ఒక రకమైన సమస్యలు ఎదుర్కొంటుంటే చిన్న సినిమాలు మరో రకంగా లాభపడుతున్నాయి.
పెద్ద సినిమా విడుదలైన మొదటి రెండు రోజులు చాలా కీలకంగా మారింది. సినిమాకి టాక్ బాగున్నా ఎలాగూ ఓటీటీలోకి వస్తుంది కదా అప్పుడు చూద్దాం అనుకునేవారు కొందరైతే, సినిమా గురించి మొత్తం తెలుసుకొని చాలా బాగుంటుందని నమ్మితేనే మారికొందరు థియేటర్లకి వస్తున్నారు.
చిన్న సినిమాలకు ఉన్నంతలో బాగానే ప్రమోషన్స్ చేస్తున్నప్పటికీ అది సరిపోక దెబ్బ తింటున్నాయని నా అభిప్రాయం. కనుక థియేటర్లలో నిలబడలేకపోయిన చిన్న సినిమాలు కొన్ని ఓటీటీలలో మంచి ప్రేక్షకాధరణ పొందుతున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో ఆడుతున్న నా ‘షో టైమ్’ ఓటీటీలో సూపర్ హిట్ అవుతుందని మా చెల్లి చెప్పినప్పుడు నవ్వాలో ఏడ్వాలో నాకు అర్ధం కాలేదు,” అని అన్నారు.