మల్లాది వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన విశ్వంభర నుంచి ఇటీవల ‘మెగా బ్లాస్ట్ గ్లిమ్స్’ విడుదల చేశారు. దానిలో చిరంజీవి గ్రాఫిక్స్ కారణంగా సినిమా ఆలస్యమవుతోందని, కానీ అభిమానులకు లీక్ ఇస్తున్ననంటూ వచ్చే ఏడాది వేసవిలో విశ్వంభర విడుదల చేస్తున్నామని చెప్పారు.
ఇక మారుతి దర్శకత్వంలో ప్రభాస్ మొదలుపెట్టిన ‘రాజాసాబ్’ కూడా ఇదే కారణంగా ఆలస్యమవుతోంది. రెండూ పెద్ద హీరోల భారీ బడ్జెట్ సినిమాలే. పాన్ ఇండియా మూవీలే. కనుక అన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమే అని అభిమానులు సరిపెట్టుకోక తప్పదు.
కానీ వాటి కంటే చాలా ఆలస్యంగా మొదలుపెట్టిన ‘మిరాయ్’ ట్రైలర్ ఈరోజు చెప్పిన సమయానికి విడుదల చేశారు. ట్రైలర్లో గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇక మిరాయ్ దాదాపు చెప్పిన సమయానికే అంటే సెప్టెంబర్ 12న విడుదల చేస్తున్నారు.
విశ్వంభర, రాజాసాబ్ కేవలం 5 భాషల్లోనే తీస్తున్నారు. కానీ మిరాయ్‌ని వాటితో పాటు బెంగాలీ, మరాఠీ, ఇంగ్లీష్, చైనీస్ భాషల్లో 2డి, 3డి ఫార్మాట్‌లలో కూడా నిర్మిస్తున్నారు.
కనుక విశ్వంభర, రాజాసాబ్ సినిమాలతో పోలిస్తే మిరాయ్ ఏవిదంగాను తక్కువనుకోలేము. కానీ చిన్న సినిమా అనుకుంటున్నా మిరాయ్ చెప్పిన సమయానికి అన్ని పనులు పూర్తి చేసుకొని విడుదల కాబోతుంటే, భారీ అంచనాలున్న రెండు పెద్ద సినిమాలు విశ్వంభర, రాజాసాబ్ ఇంకా ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా చెప్పలేని దుస్థితి నెలకొంది. ఎందుకు? సమాధానం వారికే తెలియాలి.