అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్-2027 షెడ్యూల్ ప్రకటించింది. 2027, జనవరి 21 నుంచి ఫిబ్రవరి 6 వరకు బంగ్లాదేశ్, నేపాల్ వేదికలుగా ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.
వీటిలో మొత్తం 16 జట్లు, నాలుగు గ్రూపులుగా 41 మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ వేర్వేరు గ్రూపుల్లో ఉన్నాయి.
గ్రూప్-ఏలో భారత్, ఐర్లాండ్, వెస్టిండీస్, నేపాల్, గ్రూప్-బిలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, సమోవా జట్లు ఉన్నాయి. గ్రూప్-సిలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నైజీరియా, యూఏఈ, గ్రూప్-డిలో ఇంగ్లండ్, శ్రీలంక, అమెరికా, స్కాట్లాండ్ పోటీ పడనున్నాయి.
జనవరి 22న భారత్-వెస్టిండీస్ మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. జనవరి 24న భారత్-నేపాల్, 26న భారత్- ఐర్లాండ్ మధ్య వరుసగా మ్యాచ్‌లు జరుగుతాయి.
పాకిస్తాన్ అదే రోజు దక్షిణాఫ్రికాతో తన తొలి మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత వరుసగా జనవరి 24న న్యూజిలాండ్‌తో, 26న సమోవాతో ఆడుతుంది. జనవరి 26తో గ్రూప్ దశ మ్యాచ్‌లు ముగుస్తాయి.
గ్రూప్ దశలో అర్హత సాధించిన జట్లు సూపర్ సిక్స్ దశకు చేరుకుంటాయి. అక్కడి నుంచి రెండు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.
ఫిబ్రవరి 4న సెమీఫైనల్స్, ఫిబ్రవరి 6న ఫైనల్ జరగనున్నాయి. సెమీఫైనల్స్‌కు ఫిబ్రవరి 5న, ఫైనల్‌కు ఫిబ్రవరి 7న రిజర్వ్ డే కేటాయించారు. వరుసగా రెండుసార్లు టైటిల్ గెలిచిన భారత్ ముచ్చటగా మూడోసారి కూడా కప్పు గెలుచుకొని టైటిల్ నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి.