చర్చలు సఫలం-ఆర్టీసీ సమ్మె విరమణ

April 25, 2026


img

తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు-మంత్రుల సమావేశం ఫలించడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. శనివారం తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ బస్సులో రోడ్లపైకి రావడంతో ఇంత త్వరగా సమ్మె ముగిసినందుకు ప్రజలు కూడా చాలా సంతోషిస్తున్నారు.  

శుక్రవారం మధ్యాహ్నం 11.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు-మంత్రుల సమావేశం సుదీర్గంగా కొనసాగింది. 

మూడు ప్రధాన డిమాండ్లు: 

1. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు విధివిధానాలు రూపొందించేందుకు అధికారులు, ఆర్టీసీ నాయకులతో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

2. ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు. 

3. ఆర్టీసీ కార్మికులు 30 శాతం ఫిట్ మెంట్ కోసం పట్టుపట్టగా చివరికి 11 శాతానికి ఇరు వర్గాలు అంగీకరించాయి.

ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ కుటుంబానికి రూ. లక్షలు నష్ట పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. 

ఆర్టీసీ యాజమాన్యం-కార్మికులకు సంబందించిన అంశాలపై యాజమాన్యంతో చర్చించుకొని పరిష్కరించుకోవాలనే మంత్రుల సూచనకు కార్మిక సంఘాల నేతలు అంగీకరించారు. 

ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, సీస్ రామకృష్ణారావు, అధికారుల కమిటీ చైర్మన్‌ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఐఏఎస్ అధికారులు సందీప్ సుల్తానియా, దాన కిషోర్ హాజరయ్యారు. 

ఆర్టీసీ కార్మిక సంఘాల తరపున ఐకాస చైర్మన్‌ ఈదురు వెంకన్న, థామస్ రెడ్డి, అశ్వథామ రెడ్డి, హనుమంతు, ముదిరాజ్, మౌలానా, మల్లేష్ తదితరులు హాజరయ్యారు. 

ఈ సమావేశంలో మంత్రులు తమ పట్ల అత్యంత మర్యాదతో వ్యవహరించిన తీరు పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, గతంలో తమతో మాజీ సిఎం కేసీఆర్‌ కర్కశంగా వ్యవహరించిన తీరుని పదేపదే గుర్తు చేసుకున్నారు. 

తమ డిమాండ్ల విషయంలో కూడా మంత్రులు సానుకూల వైఖరితో అడిగి తెలుసుకోవడం పట్ల ఆర్టీసీ సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో 55 రోజులు సమ్మె ముగిసిన తీరుని, ఇప్పుడు మూడు రోజుల్లోనే సమ్మె ముగిసిన తీరుని పోల్చుకొని సంతోషం వ్యక్తం చేశారు.


Related Post