పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. అంటే ఇది మన మహాలక్ష్మి పధకానికి కొనసాగింపు కాదు. తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షపార్టీ అన్నాడీఎంకే పార్టీ నిన్న విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ఇది. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. ఈ ఎన్నికల కోసం అన్నాడీఎంకే విడుదల చేసిన తొలి విడత మ్యానిఫెస్టోలో ఇలాంటి ఆకర్షణీయమైన హామీలు చాలానే ఉన్నాయి.
1. పురుషులకు నగర ప్రాంతాలలో ఉచిత బస్సు ప్రయాణం. ఇప్పటికే మహిళలకు ఈ పధకం అమలులో ఉంది.
2. రేషన్ కార్డు ఉన్న మహిళలకు నెలకు రూ.2,000.
3. ఇళ్ళు లేని పేదలకు ప్రభుత్వం ఉచితంగా స్థలం ఇచ్చి ఇళ్ళు కట్టిస్తుంది.
4. దళిత కుటుంబాలలో వివాహం చేసుకొని వేరే కాపురం పెడితే వారికీ ఇళ్ళు కట్టించి ఇస్తుంది.
5. రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళలకు ద్విచక్ర వాహనాలు కొనుగోలుకు రూ.25,000 రాయితీ.
6. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న 125 రోజుల ఉపాధి హామీ పధకాన్ని 150 రోజులకు పెంపు.
అధికార డీఎంకే పార్టీ స్పందిస్తూ అన్నాడీఎంకే తమ పధకాలను కాపీ కొట్టి ఈ మ్యానిఫెస్టో ప్రకటించడం సిగ్గు చేటని ఎద్దేవా చేసింది. కనుక అన్నాడీఎంకేకి పోటీగా డీఎంకే కూడా మరిన్ని ఆకర్షణీయమైన పధకాలతో మ్యానిఫెస్టో ప్రకటించడం ఖాయమే.