ఈఎంఐ కట్టకపోతే ఫోన్‌ లాక్ అయిపోతుందట!

September 12, 2025


img

దేశంలో 30-40 శాతం మంది రూ.30,000 అంత కంటే ఖరీదైన మొబైల్ ఫోన్లనే వాడుతున్నారు. కొంతమంది లక్ష రూపాయలు ఖరీదు గల ఫోన్లు కూడా వాడుతున్నారు. కనుక చాలా మంది ఫైనాన్స్ కంపెనీల ద్వారా వాటిని కొనుగోలు చేసి నెలనెలా వాయిదాలు చెల్లిస్తుంటారు. 

కానీ వివిధ కారణాల వలన లక్షల మంది నెలనెలా వాయిదాలు చెల్లించకపోవడంతో వారికి అప్పు ఇచ్చిన ఫైనాన్స్ కంపెనీలు తీవ్ర నష్టాలలో మునిగిపోతున్నాయి. బైక్‌లు, కార్లు వంటివాటికి వాయిదాలు చెల్లించకపోతే ఫైనాన్స్ కంపెనీ తాలూకు మనుషులు వచ్చి వాటిని పట్టుకుపోతుంటారు. కానీ లక్షల సంఖ్యలో అమ్ముడయ్యే మొబైల్ ఫోన్లను ఆవిధంగా స్వాధీనం చేసుకోవడం చాలా కష్టమే. 

కనుక సకాలంలో వాయిదాలు చెల్లించకపోతే ఆ మొబైల్ ఫోన్లను లాక్ చేసేందుకు వీలుగా ముందుగానే వాటిలో ఓ ప్రత్యేకమైన యాప్ ఇన్స్టాల్ చేయాలని ఫైనాన్స్ కంపెనీల ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం. 

కానీ మొబైల్ ఫోన్‌ కొనుగోలు చేసే వినియోగదారు అనుమతి తీసుకోవలసి ఉంటుందని, మొబైల్ ఫోన్‌లో వినియోగదారుల వ్యక్తిగత డేటాని రహస్యంగా సేకరించడం, ఇతరులతో పంచుకోవడం వంటివి చేయరాదని కేంద్ర ప్రభుత్వం షరతులు విధించినట్లు తెలుస్తోంది. 

ఈ ప్రతిపాదన ఆచరణలోకి వస్తే ఇకపై సకాలంలో వాయిదాలు చెల్లించకపోతే, అది లక్ష రూపాయల మొబైల్ ఫోన్‌ అయినా సరే లాక్ అయిపోతుంటుంది. ఈ వార్తని కేంద్ర ప్రభుత్వం ఇంకా ధృవీకరించాల్సి ఉంది. 


Related Post