దాదాపు రెండు వారాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని ముంచెత్తిన వర్షాలు కాస్త తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ మళ్ళీ నేటి నుంచి శనివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.
ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో పలు ప్రాంతాలలో వర్షం మొదలైంది. రాష్ట్రంలో ఇతర జిల్లాలలో కూడా మొదలైంది. రేపు (శుక్రవారం) హైదరాబాద్‌తో సహా ఉమ్మడి రంగారెడ్డి నల్గొండ, వరంగల్, ఆదిలాబాద్, మహబూబాబాద్ జిల్లాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది.
ఈసారి వర్షంతో పాటు 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురుగాలులు కూడా వేస్తాయని కనుక ఆయా ప్రాంతాలలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జిల్లా అధికారులు, విపత్తు నిర్వహణ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేసుకొని సిద్దంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.