చరిత్ర లేనివారు చరిత్రని చెరిపేయాలనుకుంటారు: కవిత

December 10, 2024


img

తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై బిఆర్ఎస్ పార్టీ ఎంతగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సిఎం రేవంత్ రెడ్డి నిన్న తన మంత్రులు, అధికారులతో కలిసి సచివాలయ ఆవరణలో 20 అడుగుల ఎత్తైన తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీనిపై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందిస్తూ ‘విగ్రహాలు మారిస్తే చరిత్ర మారదు,” అనే శీర్షికన వ్రాసిన ఓ వ్యాసం ‘నమస్తే తెలంగాణ’ నేటి సంచికలో ప్రచురితమైంది. ఆమె ఏమన్నారో ఆమె మాటల్లోనే.. 

“చరిత్ర నిర్మాణంలో పాల్గొననివారు మొదట చేయాలనుకునే పని చరిత్రను చెరిపేయాలనుకోవడం. అది కుదరని పక్షంలో దానిని వక్రీకరించడం. ఇప్పుడు తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పనులివే. పట్టుబట్టి మరీ తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చే దుస్సాహసానికి పూనుకున్నది రేవంత్‌ ప్రభుత్వం. ఈ దుర్ఘటన ఎంతోమంది తెలంగాణవాదులను బాధించింది. 

సమైక్య పాలనలో ఇక్కడి నేల అడుగడుగునా విస్మరణలకు గురైన సందర్భంలో ఎగసిన తెలంగాణ బిడ్డల పునరుత్థాన కేతనంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో నిలిచింది. ఇక్కడి సంస్కృతి ప్రతి సందర్భంలో అవమానాలకు గురవుతుంటే ఈ బిడ్డలు చేసుకున్న ధిక్కార ప్రకటన తెలంగాణ తల్లి. 

మరోవైపు తెలంగాణకే సొంతమైన మట్టివాసనల పరిమళం బతుకమ్మను ఇపుడు విగ్రహం నుంచి తొలగించడం హేయమైన చర్య. ఇది ఇక్కడి ఆడబిడ్డల సాంస్కృతిక వారసత్వాన్ని కనుమరుగు చేయడమే. ఆ లోటును కాంగ్రెస్‌ హస్తం ఎప్పటికీ భర్తీ చేయలేదు. 

మరో పక్క తెలుగు తల్లి చేతిలోని పూర్ణకుంభం స్థానికత్వానికి గుర్తే కదా. మరి తెలంగాణ తల్లెందుకు తన ఆనవాళ్లను కోల్పోవాలి. ప్రతీకలను తీసుకునేది ఒక ప్రాంతంలోని ఉన్నత విలువలను, ఆంశాలను గొప్పగా బయటి ప్రపంచానికి చూపేందుకు కదా? అంటూ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

పూర్తి వ్యాసం లింక్: https://www.ntnews.com/opinions/changing-statues-wont-change-history-1818577 


Related Post