తెలంగాణలో మరో అవినీతి తిమింగలం

June 26, 2026
img

ఇటీవల ఏసీబీ వరుసగా అవినీతి అధికారుల ఇళ్ళపై దాడులు చేస్తూ భారీగా నగదు, బంగారు వెండి ఆభరణాలు, వందల కోట్లు విలువగల స్థిరాస్తి పత్రాలు స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. అయినప్పటికీ కొందరు అధికారులు జంకూగొంకూ లేకుండా అవినీతికి పాల్పడుతూనే ఉన్నారు.

తాజాగా ఏసీబీ అధికారులు సస్పెండ్ అయిన శామీర్ పేట్ తహసీల్దార్ తుమ్మకొమ్మ సుచరిత ఇంట్లో సోదాలు నిర్వహించారు. అదే సమయంలో మరో మూడు బృందాలు ఆమె బంధువులు, బినామీల ఇళ్ళలో కూడా సోదాలు నిర్వహించారు. మొత్తం రూ.5 కోట్లు విలువైన బంగారం, వెండి, వజ్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఆమెకు సిద్ధిపేట జిల్లాలో మర్కూక్ మండలం దామరకుంతలో 2.17 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో మూడు ప్రాంతాలలో మూడు ఫ్లాట్స్, ఖానామేట్, కీసర వద్ద రెండు ఇంటి స్థలాలు,  ఇంట్లో రూ.12 లక్షలు, బ్యాంకులో మరో రూ. 38 లక్షల నగదు కోట్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఆమె పేరిట ఒక వోక్స్ వ్యాగన్ కారు, మరో హ్యుందాయ్ కారు ఉన్నట్లు గుర్తించారు. ఆమె అక్రమాస్తుల విలువ మొత్తం రూ.5.05 కోట్లు కాగా మార్కెట్ విలువ ప్రకారం వాటి విలువ సుమారు రూ. 50 కోట్లు పైనే ఉంటుందని తెలిపారు. 

Related Post