హైదరాబాద్‌లో ఓఆర్‌ఆర్‌పై నిలిపి ఉంచిన వాహనాలను దొంగతనాలు చేస్తున్న పార్ధి గ్యాంగ్‌ను నల్గొండ, రాచకొండ పోలీసులు కలిసి సినిమా ఫక్కీలో అరెస్ట్ చేశారు. వాహనాల దొంగతనం కేసులు నమోదవుతుండటంతో నల్గొండ, రాచకొండ పోలీసులు ఓఆర్‌ఆర్‌పై నిఘా పెట్టగా పార్ధి గ్యాంగ్ దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించారు.
దీంతో శుక్రవారం తెల్లవారుజామున వారిని అరెస్ట్ చేసేందుకు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధ్వర్యంలో నల్గొండ పోలీసులు వారిని చుట్టుముట్టగా, వారు వాహనంలో పారిపోయేందుకు ప్రయత్నించారు.
అయితే వారిని రెండు వైపులా ముట్టడించి అరెస్ట్ చేయాలని పోలీసులు ముందుగానే ప్లాన్ చేసుకోవడంతో వారిని పెద్ద అంబర్ పేట వైపు వెళ్ళేలా వెంబడించారు. అప్పటికే అక్కడ రాచకొండ పోలీసులు సిద్దంగా ఉన్నారు. పార్ధి గ్యాంగ్ అక్కడకు చేరుకోగానే నల్గొండ, రాచకొండ పోలీసులు చుట్టుముట్టారు.
అప్పటికి గానీ వారికి తాము పోలీసుల వలలో చిక్కుకున్నామని అర్ధం కాలేదు. కానీ వారి నుంచి తప్పించుకునేందుకు చివరి ప్రయత్నంగా తమ వద్ద ఉన్న కత్తులతో వారిపై దాడులు చేయబోయారు. ఇది కూడా ముందే ఊహించిన రాచకొండ పోలీసులు తుపాకులతో గాల్లో కాల్పులు జరుపుతూ వారిని హెచ్చరించడంతో అందరూ కత్తులు కింద పడేసి పోలీసులకు లొంగిపోయారు.
పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం పోలీసులు వారిని మీడియా ఎదుట ప్రవేశపెట్టి వారి వివరాలను, వారు దొంగతనం చేసిన వాహనాల వివరాలను వివరించనున్నారు.