కెసిఆర్ ఇక్కడ పులి..అక్కడ పిల్లి: షబ్బీర్ అలీ

February 16, 2018


img

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది కనుక ఆ రెండు పార్టీల మద్య నిత్యం మాటల యుద్ధం అనివార్యమవుతోంది. నిజానికి కాంగ్రెస్ కూడా అదే గుర్తింపు కొరుకొంటోంది కనుక తెరాసను గట్టిగా డ్డీ కొంటోంది. కేంద్ర బడ్జెట్ కేటాయింపులు, కందులు, ఎర్రజొన్నలు కొనుగోలుపై వాటి మద్య జోరుగా మాటల యుద్దాలు సాగుతున్నాయి. సీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆ మంటలను మరింత రాజేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

శుక్రవారం అయన హైదరాబాద్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “కెసిఆర్ ఇక్కడ పులిలా గర్జిస్తుంటారు కానీ డిల్లీలో పిల్లిలా ‘మ్యావ్ మ్యావ్..’అంటారు. ప్రధాని నరేంద్ర మోడీని చూస్తే కెసిఆర్ కు భయం అందుకే కేంద్ర బడ్జెట్ లో తెలంగాణాకు అన్యాయం జరిగినా, విభజన హామీలు అమలుచేయకపోయినా అయన నోరెత్తి మాట్లాడరు. ముస్లింలకు రిజర్వేషన్ల శాతం పెంచుతామని గొప్పలు చెప్పుకొన్నారు. ఇప్పుడు ఆ బిల్లు ఏమయింది? దానిని అసలు డిల్లీకి పంపారా లేదా? ముస్లింలకు ఇంకా ఎప్పుడు రిజర్వేషన్లు పెంచుతారు? నిజామాబాద్ లో పసుపుబోర్డు ఏర్పాటు కాబోతోందని తెరాస ఎంపి కవిత చెప్పారు. అదేమయింది?

కర్ణాటక ప్రభుత్వం కంది రైతులకు బోనస్ ఇస్తోంది. ధనిక రాష్ట్రమని చెప్పుకొంటున్న తెలంగాణా ఎందుకు ఇవ్వలేకపోతోంది? కందులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఎర్రజొన్న రైతులు గిట్టుబాటు ధర రావడంలేదని రోడ్లేక్కి ఆందోళన చేస్తుంటే సిగ్గుతో తల దించుకోవలసిన తెరాస సర్కార్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లి తప్పించుకొవాలని ప్రయత్నిస్తోంది. ఇదేనా రైతు సంక్షేమ ప్రభుత్వం? తెరాస సర్కార్ తన వల్ల కాకపోతే కనీసం కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళి కంది, ఎర్రజొన్న రైతులను ఆదుకోవాలి,” అని షబ్బీర్ అలీ అన్నారు. 


Related Post