బుధవారం విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాలలో బాలురు కంటే బాలికలే ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహించిన పరీక్షలకు మొత్తం 4,96,374 మంది రెగ్యులర్ విద్యార్ధులు, 10,733 మంది ప్రైవేట్ విద్యార్ధులు హాజరవగా వారిలో 4,60,519 మంది అంటే 92.78 శాతం ఉత్తీర్ణులయ్యారు.
ఈ ఫలితాలలో బాలికలు 94.26 శాతం, బాలురు 91.32 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మొదటి పది స్థానాలలో 8 బాలికలకు, మిగిలిన రెండు స్థానాలు బాలురుకి దక్కాయి.
నిజామాబాద్‌కు చెందిన సిర్ప కృతి, కామారెడ్డికి చెందిన నిమ్మ అన్షిత 600 కి 596 మార్కులు సాధించి రాష్ట్రంలో టాపర్స్‌గా నిలిచారు.
మహబూబాబాద్ 99.29 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలువగా, వికారాబాద్ 73.97 శాతంతో చివరి స్థానంలో నిలిచింది.
రాష్ట్రంలో కార్పొరేట్ స్కూల్ విద్యార్ధుల కంటే ప్రభుత్వ అధ్వర్యంలో నడిచే గురుకుల పాఠశాల విద్యార్ధులు 92.78 శాతం ఉత్తీర్ణతతో అత్యుత్తమ ఫలితాలు సాధించడం మరో విశేషం.
రాష్ట్రంలో 4,629 ప్రభుత్వ పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, మరో రెండు పాఠశాలలలో ఒక్కరు కూడా ఉత్తీర్ణులు కాలేదు.
పదో తరగతి పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్ధులకు జూన్ 3నుంచి 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలియజేసింది. నేటి నుంచి మే 15 వరకు రీ వెరిఫికేషన్, మార్కులు రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది.