బాలికలు కూడా చక్కగా చదువుకొని తమ జీవితాలను తీర్చిదిద్దుకోవాలని ఎంతో తపించిన మహనీయురాలు సావిత్రీబాయి ఫూలే. ఆమె మహాత్మా జ్యోతీబా ఫూలే సతీమణి. ఈరోజు ఆమె జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఓ చక్కటి నిర్ణయం తీసుకుంది.
ఆమె స్మృత్యర్ధం ఇకపై ఏటా జనవరి 3వ తేదీన మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ జీవో జారీ చేశారు.
మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో మహిళా ఉపాధ్యాయులను సన్మానించాలని, బాలికలు చదువుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు నిర్వహించాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా నేడు సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మహిళల హక్కులు, విద్య కోసం ఆనాడే గొంతెత్తి పోరాడిన సావిత్రీబాయి ఫూలే నేటికీ అందరికీ స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారని, ఆమె ఆశయ సాధన కోసం తమ ప్రభుత్వం నిబద్దతతో కృషి చేస్తుందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆమె స్పూర్తితో ముందుకు సాగాలనే ఆలోచనతోనే ఆమె జయంతి రోజున మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుందామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.