అందుకు రెండున్నర దశాబ్దాలు పట్టింది!

September 07, 2017


img

భారతదేశంలో న్యాయవిచారణ నత్త నడకన ఏవిధంగా సాగుతుందో తెలుసుకోవడానికి 1993 ముంబై వరుస బాంబు ప్రేలుళ్ళ కేసును చెప్పుకోవచ్చు. సుమారు రెండున్నర దశాబ్దాల క్రితం అంటే 1993 ముంబై వరుస బాంబు ప్రేలుళ్ళ కేసులో రెండవ దశ తీర్పును గురువారం ముంబైలోని టాడా కోర్టు ప్రకటించింది. 

ఆ కేసులో ప్రధాన దోషులుగా గుర్తించబడిన తాహిర్ మర్చంట్, ఫిరోజ్ ఖాన్ లకు టాడా కోర్టు మరణశిక్షలు ఖరారు చేసింది. అదే కేసులో దోషులుగా పేర్కొనబడిన కరీముల్లా ఖాన్, అబూ సలేంలకు జీవిత ఖైదు విధించింది. రియాజ్ సిద్దికి అనే మరొక దోషికి 10 ఏళ్ళు జైలు శిక్ష విధించింది. అయితే వారిలో జైలుశిక్ష పడినవారు ఇప్పటికే చాలా ఏళ్లుగా జైలులోనే ఉన్నందున ఆ మేరకు వారికి శిక్ష తగ్గించబడుతుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికం మీడియాకు తెలిపారు. 

 1993 ముంబై వరుస బాంబు ప్రేలుళ్ళలో 257 మంది పౌరులు చనిపోగా మరో 713 మంది గాయపడ్డారు. అప్పటి నుంచి ఆ కేసుల విచారణ నేటికీ కొనసాగుతూనే ఉంది. ఈ కేసులలో ఎన్.ఐ.ఏ. దర్యాప్తు ఒక సుదీర్గ ప్రక్రియ కాగా మళ్ళీ దానిపై టాడా కోర్టులో విచారణ ప్రక్రియ కూడా అంతకంటే సుదీర్గంగా సాగింది. 

ఈ కేసులో ఆధారాలు, సేకరణ, వాటి పరిశీలన, సాక్షుల వాగ్మూలాల సేకరణ మళ్ళీ వాటి పరిశీలన వంటివి చాలా క్లిష్టమైనవే. కానీ దోషులను రక్షించడానికి తెర వెనుక కొందరు రాజకీయ నేతలు లేదా కొన్ని శక్తులు చేసిన ప్రయత్నాల వలననే ఈ కేసు ఇంత సుదీర్గంగా సాగిందనేది బహిరంగ రహస్యమే. 

ఈ కేసులలో దోషులను రక్షించేందుకు సమర్ధులైన న్యాయవాదులను నియమించుకోవడం మన న్యాయవ్యవస్థలో తప్పుగా పరిగణించబడదు. ఎందుకంటే ‘వందమంది అపరాదులు తప్పించుకొని పోయినా పరువాలేదు కానీ ఒక్క నిర్దోషి శిక్షించబడకూడదనే’ సిద్దాంతం మీద మన న్యాయవ్యవస్థ నడుస్తోంది కనుక. కనుక బోనులో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా దోషి అని అందరికీ తెలిసి ఉన్నప్పటికీ, అతనికి తాను నిర్దోషినని నిరూపించుకోవడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. 

కనుక ఎంత బలమైన సాక్ష్యాదారాలున్నప్పటికీ చట్టాలలో లొసుగులను చాలా తెలివిగా ఉపయోగించికొని  కేసులను పక్కదారి పట్టించడమో అది వీలుకాకుంటే కేసును సాధ్యమైనన్ని ఎక్కువ ఏళ్ళు సాగదీయగల గొప్పగొప్ప న్యాయవాదులు మన దేశంలో కోకోల్లలున్నారు. అందుకే ఈ కేసు విచారణ ముగిసి తీర్పు చెప్పడానికి 24 ఏళ్ళు పట్టింది. 

అయితే ఈ కధ ఇక్కడితో ముగిసిపోతే గొప్పేముంటుంది? దోషులకు శిక్షలు ఖరారు అయినప్పటికీ వారు ఇంకా హైకోర్టు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. కనుక ఈ సుదీర్గ విచారణలో ఈ రోజు వెలువడిన తీర్పు ఒక కామాయే తప్ప ఫుల్ స్టాప్ కాదని చెప్పవచ్చు. 

వందలమంది ప్రజలను బలిగొన్న ఇటువంటి నేరస్తులను గుర్తించినా శిక్షించలేకపోతున్నందుకు ఏమనుకోవాలి? దిస్ కెన్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా అనుకోవాలా? ఏమో! 


Related Post