అందుకే సమగ్ర భూసర్వేను వ్యతిరేకిస్తాం: రేవంత్ రెడ్డి

September 01, 2017


img

రాష్ట్రంలో తెలంగాణా రైతు సమన్వయ సమితుల ఏర్పాటుచేసి తరువాత సమగ్ర భూసర్వే నిర్వహించడానికి ప్రభుత్వం నేటి నుంచి కసరత్తు మొదలుపెట్టింది. ప్రభుత్వ నిర్ణయాలపై తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చాలా తీవ్రంగా స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి కేసీఆర్ నెలకొక కొత్త పధకం ప్రవేశపెడుతుంటారు. దాని గురించి గట్టిగా ప్రచారం చేసుకొన్నాక దానిని పక్కన పడేసి మరో కొత్త పధకం ప్రకటిస్తుంటారు. గత మూడేళ్ళుగా ఆయన చేస్తున్న పని ఇదే..మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూ కాలక్షేపం చేస్తున్నారు. మూడేళ్ళ క్రితం ప్రకటించిన మన ఊరు-మన ప్రణాళిక ఏమైంది? దానిని ఎప్పుడైనా ఎక్కడైనా అమలుచేశారా? తరువాత దాని ఊసే ఎత్తడం లేదు. మళ్ళీ ఇప్పుడు రైతు సమన్వయ సమితిల ఏర్పాటు, సమగ్ర భూసర్వే అంటున్నారు. ఆ రైతు సంఘాలన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రుల కనుసన్నలలో ఏర్పాటు చేస్తున్నావే కనుక వాటి వలన రైతులకు ఏమీ ప్రయోజనం ఉండకపోవచ్చు. అలాగే సమగ్ర భూసర్వే వలన రైతులకు ఏ ప్రయోజనం కలుగకపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఆయన పార్టీ నేతలకు తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. అందుకే మేము దాని కోసం జారీ చేసిన జీవో 39ను రద్దు చేసేవరకు పోరాటం చేస్తాము,” అని అన్నారు. 

ఎప్పుడో బ్రిటిష్ కాలంలో సమగ్ర భూసర్వే జరిగింది. అప్పటి నుంచి మళ్ళీ ఈ స్థాయిలో ఎన్నడూ భూసర్వే జరుగలేదు. కనుక నేటికీ ఆ పాత రికార్డుల ఆధారంగానే భూలావాదేవీలు నడుస్తున్నాయి. కానీ గత ఐదారు దశాబ్దాలలో భూములు అనేక చేతులు మారాయి. అనేక చోట్ల ఆక్రమణలు గురయ్యాయి. లేదా వివాదాలలో చిక్కుకొన్నాయి. ఆ కారణంగా వాటిలో ఏవి ప్రభుత్వ భూములో..ఏవి ప్రైవేట్ భూములో..ఏవి అసైన్డ్ భూములో..ఏవి ఆక్రమణలకు గురయ్యాయో రెవెన్యూ శాఖ సైతం గుర్తించలేని పరిస్థితు ఏర్పడ్డాయి. కనుక ఈ సర్వేతో అటువంటివన్నీ కనుగొని, లోపాలను సరిదిద్ది,  అన్ని రికార్డులను కంప్యూటరీకరించడం సాధ్యం అవుతుంది. వివాదాలలో చిక్కుకొన్నవి, వివాద రహితమైన ప్రభుత్వ భూములకు పక్కా లెక్కలు వస్తాయి. అలాగే రైతులకు వారి భూమి యొక్క పూర్తి వివరాలతో యాజమాన్యపు హక్కులు దృవీకరిస్తూ మళ్ళీ కొత్తగా పట్టదార్ పాసు పుస్తకాలు అందించడం వలన మళ్ళీ కొన్ని దశాబ్దాల వరకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా నివారించవచ్చు. ఈ సమగ్ర భూసర్వేతో ఇన్ని ప్రయోజనాలున్నప్పుడు దానిని ఆహ్వానించాలి తప్ప వ్యతిరేకించడం సరికాదనే చెప్పాలి. ఒకవేళ వ్యతిరేకించదలిస్తే అందుకు బలమైన కారణాలు చెప్పగలగాలి. అప్పుడే అవి అర్ధవంతమైన విమర్శలు అనిపించుకొంటాయి. 


Related Post