టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి ఇటీవల ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోమటిరెడ్డి వెంకటరెడ్డితో విభేదాల గురించి ప్రశ్నించినప్పుడు, “దయచేసి ఈ ఒక్క ప్రశ్న నన్ను అడగవద్దు. దీనిపై నేనేమీ మాట్లడదలచుకోలేదు. ఈ సమస్య అధిష్టానం దృష్టికి వెళ్ళింది. అదే చూసుకొంటుంది. ఈ విషయంలో ఇంతకంటే ఒక్క ముక్క కూడా మాట్లడదలచుకోలేదు,” అని స్పష్టంగా చెప్పారు.
వారిరువురి మద్య విభేదాలున్న సంగతి అందరికీ తెలుసు. ఉత్తం కుమార్ రెడ్డి నాయకత్వ లక్షణాలపై కోమటిరెడ్డి తీవ్ర విమర్శలు చేయడమే అందుకు కారణం. ఉత్తం కుమార్ రెడ్డి వలననే గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని కనుక ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం ఆయనను ఆ పదవిలో నుంచి తప్పించి తనను పిసిసి అధ్యక్షుడుగా చేయాలని కోమటిరెడ్డి ఇదివరకు బహిరంగంగానే అన్నారు. తనకు పార్టీ పగ్గాలు అప్పగించినట్లయితే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానని అన్నారు.
అప్పటి నుంచే వారి మద్య విభేదాలు ఇంకా పెరిగాయి. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఉత్తం కుమార్ రెడ్డికే ప్రాధాన్యం ఇస్తూ ఆయన నేతృత్వంలోనే అందరూ పనిచేయాలని, వచ్చే ఎన్నికలను ఆయన నేతృత్వంలోనే ఎదుర్కొంటామని తేల్చి చెప్పడంతో కోమటిరెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యి ఉండవచ్చు. బహుశః అందుకే ఆయన భాజపా వైపు చూస్తున్నట్లున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి సమస్యలు పెట్టుకొని ముందు వాటిని పరిష్కరించుకొనే ప్రయత్నాలు చేయకుండా, వచ్చే ఎన్నికలలో విజయం సాధిస్తామని టి-కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారు.