మద్యం విక్రయాలతో లాక్‌డౌన్‌ వృధా

May 05, 2020


img

కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవాలనే ఉద్దేశ్యంతో దేశ ఆర్ధిక వ్యవస్థను, కోట్లాదిమంది నిరుపేదల జీవితాలను  పణంగా పెట్టి గత 43 రోజులుగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నాయి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు. అయితే మద్యంపై వచ్చే బారీ రాబడికి ఆశపడో లేదా రాజకీయనాయకులలో చేతిలో ఉండే మద్యం సిండికేట్ల ఒత్తిళ్లకు తలొగ్గడం చేతనో పలు రాష్ట్రాలలో సోమవారం నుంచి మద్యం దుకాణాలు తెరిచేశారు. 

దాంతో నెలరోజులుగా గొంతులో చుక్క పడక విలవిలలాడుతున్న మందుబాబులు మద్యం దుకాణాల వద్ద కిలోమీటర్ల పొడవునా బారులు తీరారు. అంతమందిని పోలీసులు నియంత్రించలేకపోవడంతో మద్యం కోసం క్యూలో ఉన్నవారు కుమ్ములాడుకొన్నారు. సామాజిక దూరం లేదు.. మాస్కూలు లేవు. కరోనా భయం అంతకంటే లేదు...మద్యం దొరికితే చాలన్నట్లు జనం ఎగబడ్డారు. అనేక చోట్ల మందుబాబులను నియంత్రించలేక పోలీసులు లాఠీ ఛార్జీ కూడా చేయవలసి వచ్చిందంటే పరిస్థితులు అర్ధం చేసుకోవచ్చు. 

ఇక గ్రీన్, ఆరెంజ్‌ జోన్లలో మద్యం దుకాణాలు తెరుచుకొన్నాయనే వార్తా దావానంలా వ్యాపించడంతో ఎక్కడెక్కడి నుంచి జనాలు వచ్చేశారు. ఇక నుంచి రోజూ మద్యం విక్రయాలు కొనసాగుతాయి కనుక ప్రతీరోజూ ఇలాగే జనాలు మద్యం కోసం ఎగబడుతుంటారు. దాంతో 43 రోజులుగా లాక్‌డౌన్‌.. పోలీసులు.. మునిసిపల్.. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పడిన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. 

మద్యం కోసం వచ్చేవారిలో కరోనా రోగులు కూడా ఉండవచ్చు కానీ వారిని ఎవరూ గుర్తించలేరు కనుక అందరికీ సోకే ప్రమాదం ఏర్పడింది. వారి ద్వారా వారి కుటుంబ సభ్యులకు...ఇరుగుపొరుగువారికి కూడా కరోనా సోకే ప్రమాదం కనిపిస్తోంది. 

కరోనా లక్షణాలు బయపడేందుకు 14 రోజులు పడుతుంది కనుక ఈ నెల 17న లాక్‌డౌన్‌ ముగిసేసమయానికి ఇప్పుడు మద్యం కోసం ఎగబడుతున్నవారిలో కరోనా బయటపడవచ్చు. దాంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య శరవేగంగా పెరిగిపోవచ్చు. అదే కనుక జరిగితే ఇన్ని రోజుల లాక్‌డౌన్‌, త్యాగాలు అన్నీ వృధాయే.  

ఇంకా గమ్మతైన విషయం ఏమిటంటే, ప్రజలు బియ్యం, పప్పులు, కూరగాయలు వంటి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకే అనుమతిస్తుంటే, మద్యం విక్రయాలకు మాత్రం ఉదయం 11 నుంచి సాయంత్రం 7 గంటల వరకు అనుమతిస్తుండటం. అంటే నిత్యావసర వస్తువుల కంటే మద్యం అమ్మకాలకే ప్రభుత్వాలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయన్న మాట! సాయంత్రం 7 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంటున్నందున, ఇకపై ప్రజలు ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకు రోడ్లపై తిరిగే అవకాశం ప్రభుత్వమే స్వయంగా కల్పించినట్లు అయ్యింది కనుక ఇప్పుడు పోలీసులు ఎవరినీ అడ్డుకోలేని నిసహాయత ఏర్పడింది. 

లాక్‌డౌన్‌తో రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం కోల్పోయి ఆర్ధిక ఇబ్బందులలో చిక్కుకొన్న మాట వాస్తవమే. కానీ సులువుగా ఆదాయం పెంచుకోవడం కోసం మద్యం విక్రయాలను అనుమతించి ప్రజల ఆరోగ్యాన్ని, చివరికి ప్రాణాలను కూడా పణంగా పెట్టాలనుకోవడం సరికాదు. లాక్‌డౌన్‌ కారణంగా ఆదాయం కోల్పోయి విలవిలలాడుతున్న అనేక కుటుంబాలలో ఇప్పుడు ఈ మద్యం కొత్త చిచ్చు పెట్టడం ఖాయం కనుక కరోనాతో పాటు కొత్తగా కుటుంబ, సామాజిక సమస్యలు కూడా మొదలయ్యే ప్రమాదం పొంచి ఉంది. మరివన్నీ ప్రభుత్వాలకు..అధికారులకు తెలియవనుకోవాలా లేక తెలిసే చేస్తున్నారనుకోవాలా?



Related Post