కశ్మీర్ ప్రజల కష్టాల ముందు మనవెంత?

March 24, 2020


img

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునివ్వగానే యావత్ దేశప్రజలు నిక్కచ్చిగా పాటించి శభాష్ అనిపించుకున్నారు. ఒక్కరోజు జనతా కర్ఫ్యూ పాటించడంతో తమ దేశభక్తి నిరూపించుకున్నామనుకున్నామని...అక్కడితో తమ బాధ్యత తీరిపోయిందని అనుకున్నారో ఏమో…రెండు తెలుగు రాష్ట్రాలలో లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ ప్రజలు యధేచ్చగా వాహనాలు వేసుకొని రోడ్లపైకి వచ్చి తిరుగుతున్నారు. పోనీ..తమకు కరోనా సోకదనే ధీమాగా ఉన్నారా అంటే అదీ లేదు. పక్కనున్నవాడు తుమ్మినా దగ్గినా వాడికి కరోనా ఉందేమోనని భయంతో వణికిపోతున్నారు. అంత భయపడుతున్నప్పుడు రోడ్లపై తిరగవలసిన అవసరం ఏమిటి? లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ ఎందుకు రోడ్లపైకి వచ్చారని పోలీసులు, మీడియా నిలదీస్తే రకరకాల కారణాలు చెపుతున్నారు తప్ప బయటకు రావడం వలన కరోనా వైరస్‌ వ్యాప్తికి దోహదపడుతున్నామని భావించడం లేదు. ఆదివారం కనబరిచిన దేశభక్తి సోమవారం ఉదయానికల్లా ఏమయిందో తెలీదు. 

ఇదివరకు ఉరుకుల పరుగులు జీవితాలు గడుపుతున్నప్పుడు నాలుగు రోజులు శలవు దొరికితే హాయిగా కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకొన్నవారు ఇప్పుడు 9 రోజులు శలవులు లభిస్తే గట్టిగా రెండు రోజులు ఇంట్లో నిలకడగా కూర్చోలేమంటూ వాహనాలు వేసుకొని ఇష్టం వచ్చినట్లు రోడ్లపై తిరుగుతున్నారు. 

కశ్మీర్‌లో గత మూడునాలుగు దశాబ్ధాలుగా ఇంతకంటే దారుణమైన పరిస్థితులే నెలకొని ఉన్నాయి. ఒకపక్క వేర్పాటువాదుల ఒత్తిళ్ళు, బెదిరింపులు, మరోపక్క ఉగ్రవాదుల దాడులు, కిడ్నాపులు, వారికీ భద్రతాదళాలకు మద్య తరచూ కాల్పులు, ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా నిత్యం ఆంక్షలు...గత మూడు, నాలుగు దశాబ్ధాలుగా కశ్మీర్‌లో ఇవే పరిస్థితులు...వాటిమద్యే  ప్రజలు జీవిస్తున్నారు. 

వారు ఎదుర్కొంటున్న ఈ సమస్యలు, కష్టాలతో పోలిస్తే దేశం నడిబొడ్డున సకలసదుపాయాలతో జీవిస్తున్న మనందరి కష్టాలు ఏపాటి? అని ఆలోచిస్తే ప్రజలు ఈవిధంగా వ్యవహరించరు. ఇప్పుడు రోడ్లపై యాదేచ్చగా తిరుగుతున్న వారందరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఒకసారి కరోనా వైరస్‌ సోకినట్లు అనుమానం కలిగితే అప్పుడు 14 రోజులు ఆసుపత్రులలో లేదా క్వారంటైన్ శిబిరాలలో ఒంటరిగా గడపవలసి వస్తుంది. ఒకవేళ కరోనా అంటుకుంటే అది పూర్తిగా తగ్గేవరకు ఆసుపత్రి గదిని దాటి బయటకు వచ్చే అవకాశమే ఉండదు. ఖర్మకాలి కరోనాతో చచ్చిపోతే శవాన్ని చూసేందుకు కనీసం కుటుంబ సభ్యులు కూడా రాలేరు. అంత్యక్రియలు నిర్వహించలేరు. ఏ మునిసిపల్ సిబ్బందో..ఆసుపత్రి సిబ్బంది చేతులలో అనాధ శవంలా తగలబడిపోవలసిందే! అటువంటి దుస్థితి మనకు వద్దనుకుంటే ఇళ్ళలో నుంచి బయటకు రాకుండా కూర్చోవడం చాలా అవసరం. 


Related Post