ఆయన వృత్తికి ద్రోహం చేశాడు: నిర్భయ తల్లి

March 20, 2020


img

నిర్భయ దోషులను నేడు ఉరితీసిన తరువాత ఆమె తల్లితండ్రులు, వారి న్యాయవాది సీమా ఖుష్ వహానీ చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇన్నేళ్ళకు నిర్భయకు న్యాయం జరిగిందని ఆమె ఆత్మ శాంతిస్తుందని వారు అన్నారు. ఈరోజు తెల్లవారుజామున నిర్భయ దోషులను ఉరి తీస్తున్నారనే వార్త విని వందలాదిమంది ప్రజలు తీహార్ జైల్ వద్దకు చేరుకొన్నారు. దోషులను ఉరి తీసినట్లు అధికారులు ప్రకటించగానే అందరూ ఒకరికొకరు స్వీట్లు తినిపించుకొని సంతోషం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా నిర్భయ తల్లి, వారి న్యాయవాది సీమా ఖుష్ వహానీ మీడియాతో మాట్లాడుతూ, “అత్యంత హేయమైన నేరానికి పాల్పడిన ఆ దోషులను రక్షించేందుకు వారి న్యాయవాది ఏపీ సింగ్‌ ప్రయత్నించడం చాలా సిగ్గుచేటు. తద్వారా ఆయన న్యాయవాద వృత్తికే కళంకం తెచ్చారు. ఆయన ఈ వృత్తికి పనికిరారు,” అని అన్నారు. నిర్భయ దోషులను కాపాడేందుకు ఆయన చివరి నిమిషం వరకు న్యాయపోరాటం చేయడంపై సోషల్ మీడియాలో కూడా ఆయనను ఆక్షేపిస్తూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. 

ఈ కేసులో పోలీసులు బలమైన సాక్ష్యాదారాలను కోర్టుకు సమర్పించడంతో దోషులకు 2-3 నెలలోగానే ఉరిశిక్ష పడుతుందని, వెంటనే ఈ కేసు ముగిసిపోతుందని ఆనాడు అందరూ భావించారు. కానీ వారి న్యాయవాది ఏపీ సింగ్‌ తన అపూర్వమైన తెలివితేటలతో సుమారు ఏడేళ్లు ఈ కేసును సాగదీశారు. న్యాయస్థానం డెత్ వారెంట్స్ జారీ చేసిన తరువాత కూడా ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తూ చట్టంలో లొసుగులను లేదా అవకాశాలను తెలివిగా తమకు అనుకూలంగా మలుచుకొంటూ దోషులకు ఉరిశిక్ష అమలు చేయనీయకుండా డిల్లీ, పటియాలా హౌస్ కోర్టును, హైకోర్టును, సుప్రీంకోర్టును ముప్పాతిప్పలు పెట్టారు. 

దోషులకు ఉరిశిక్ష అమలుచేయకుండా అడ్డుకొనేందుకే ఆయన ఆ ప్రయత్నాలు చేస్తున్నాడని సుప్రీంకోర్టు కూడా గ్రహించినప్పటికీ ఆయనను అడ్డుకోలేకపోయింది. దాంతో ఆయన గత మూడు నెలలుగా దోషుల తరపు ఆయన వరుసగా వేసిన పిటిషన్లతో మూడు న్యాయస్థానాల విలువైన సమయాన్ని కూడా హరించివేశారు. చివరికి నిన్న అర్ధరాత్రివరకు పిటిషన్లు వేస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు నిద్రలేకుండా చేశారు. 

దోషుల తరపు వాదించడానికి ఆయన ఒప్పుకొన్న రోజునే, “అర్ధరాత్రివరకు ఆడపిల్లలను రోడ్ల మీద స్వేచ్ఛగా తిరగనిస్తే ఇలాగే జరుగుతుంది. ఒకవేళ నా కూతురుకే ఇలాగ జరిగితే నేనే ఆమెను చంపేసేవాడిని,” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన మనస్తత్వానికి అద్దం పడుతున్నాయి. 

దోషులకు ఉరిశిక్ష అమలుచేయడం ఖాయమని గ్రహించిన తరువాత నిన్న సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “జైలు అధికారులు, మీడియా చేతిలో దోషులు ఇప్పటికే మూడుసార్లు చచ్చిపోయారు కనుక వారికి ఉరిశిక్ష వేయకుండా దేశసరిహద్దులను కాపాడే బాధ్యత అప్పగిస్తే  వారు దేశసేవ చేస్తారని,” అన్నారు. 

ఉరిశిక్ష పడినప్పటికీ నలుగురు దోషులలో చివరి క్షణం వరకు పశ్చాత్తాపం కలుగలేదు. దోషులు హేయమైన నేరానికి పాల్పడ్డారని వారికి ఉరితీయడమే సబబు అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ వారి న్యాయవాది వైఖరిలో కూడా  ఎటువంటి మార్పు కలుగలేదు. ఆయన చెప్పిన ఈ మాటలు విన్నప్పుడు ఆయనలో ఎటువంటి అపరాధభావం కనబడటంలేదని స్పష్టం అవుతోంది. అందుకే ఆయన న్యాయవాద వృత్తికి అనర్హుడని నిర్భయ తల్లితండ్రులు అనడం సమంజసమే.             

అయితే ఈ కేసు ద్వారా ఆయన మన న్యాయవ్యవస్థలో ఎన్ని లోపాలున్నాయో కళ్ళకు కట్టినట్లు చూపించగలిగారని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే ఆయన మన న్యాయవ్యవస్థలో ‘అన్-ఎతికల్ హ్యాకర్’ అని చెప్పుకోవచ్చు. కనుక ఇటువంటి కేసులలో దోషులకు శిక్షలు అమలుచేయడంలో న్యాయ అవకాశాలుగా చెప్పుకోబడుతున్న లోపాలను పార్లమెంటులో చట్టసవరణల ద్వారా కేంద్రప్రభుత్వం సవరించగలిగితే భవిష్యత్‌లో మరెవరూ మన న్యాయవ్యవస్థను ఈవిదంగా అపహాస్యం చేయకుండా నివారించవచ్చు.


Related Post