ఛార్జీలు పెంచినా బాధపడొద్దు...

March 14, 2020


img

ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా ఛార్జీలు పెంచితే వెంటనే ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసేవి. కానీ ఛార్జీలు పెంచినా రాష్ట్రాభివృద్ధి కోసం భరించకతప్పదని సిఎం కేసీఆర్‌ చాలా లౌక్యంగా ప్రజలకు నచ్చజెపుతూ  ఛార్జీలు పెంపు అనివార్యమని ప్రజలే భావించేలా చేయగలుగుతున్నారు.  

ఆర్టీసీ సమ్మె..ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు, వారి కష్టాలు... సంస్థ నష్టాలు...వగైరా కారణాలతో ఆర్టీసీ బస్సు ఛార్జీలు ఒకేసారి 20 శాతం పెంచినప్పుడు ప్రజలు, ప్రతిపక్షాలు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. చెప్పలేదు అనే కంటే చెప్పలేకపోయారు అనుకోవచ్చు. అప్పటి పరిస్థితులు అలా ఉన్నాయి మరి. 

ఇప్పుడు కరెంటు ఛార్జీలు, ఆస్తిపన్ను పెంచుతామని ప్రజలు భరించాలని సిఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సంస్థలు కుప్పకూలకుండా కాపాడుకోవడానికి విద్యుత్ చార్జీల పెంపు అవసరమని సిఎం కేసీఆర్‌ చెప్పారు. అలాగే గ్రామాలు, పట్టణాల అభివృద్ధి, మౌలికవసతుల కల్పనకు ఆస్తిపన్ను పెంచడం చాలా అవసరమని చెప్పారు. కనుక ప్రతీ వడ్డింపుకు ఏదో ఒక కారణం ఉంటోంది. 

అయితే నెలరోజుల క్రితమే దేశంలో విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్:1, విద్యుత్ ఉత్పత్తిలో కూడా మనమే నెంబర్:1 అని గొప్పగా చెప్పుకొని ఇప్పుడు ఆ సంస్థలు మునిగిపోకుండా కాపాడుకోవాలని, అందుకు ప్రజలు తలో చెయ్యి వేయాలంటూ చెప్పడాన్ని ఏమనుకోవాలి? 

రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్-సరఫరా మద్య మంచి సమతులనం ఉన్నప్పుడు విద్యుత్ సంస్థలకు నష్టాలు ఎందుకు వస్తాయి? అనే సందేహం కలుగకమానదు. కనుక విద్యుత్ సంస్థల ఆర్ధిక సమస్యలకు వేరే ఏవో బలమైన కారణాలున్నాయని అర్ధం అవుతోంది. వాటిలో రెండు ప్రధానంగా కనిపిస్తున్నాయి. 

1. రైతులకు 24 గంటలు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం. 

2. కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ వినియోగం.         

రైతులకు అవసరమైనంత విద్యుత్ అందించడం సమంజసమే కానీ 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేయడం వలన విద్యుత్ దుర్వినియోగమవుతుందని, ప్రజలపై అదనపు భారం పడుతుందని ఆనాడే కొందరు విద్యుత్ నిపుణులు, ప్రతిపక్ష నేతలు వాదించారు. కానీ గొప్ప కోసం ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తూ ఆ భారాన్ని మిగిలిన ప్రజలపై మోపుతున్నట్లు కనబడుతోంది. 

ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వేలాదిమంది రైతులకు లబ్ది కలుగుతున్న మాట వాస్తవం. రాష్ట్రంలో సాగునీరు, త్రాగునీటి కొరత తీరుతున్న మాట కూడా వాస్తవం. లక్షలాది ఎకరాలలో పంటలు సాగులోకి వస్తున్న మాట కూడా వాస్తవం. పంటలు పండించుకోవడానికి రైతుబంధు పధకం, ఆర్ధిక సమస్యలతో చనిపోతున్న రైతులకు రైతు భీమా పధకం అమలుచేస్తున్నప్పుడు ఈ భారం రైతులపై మోపలేదు కనుక నిరంతరంగా సాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్ వినియోగానికి అయ్యే ఖర్చును ఎవరు భరించాలి? దానికి ఏవిధంగా నిధులు సమీకరించుకోవాలి? అని ప్రభుత్వం ఆలోచన చేసిందో లేదో తెలియదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్ సరఫరా చేస్తున్న సంస్థలకు భారీగా సొమ్ము చెల్లించక తప్పనిసరి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఒకవేళ చెల్లించలేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది. 


బహుశః ఈ రెంటి వలన విద్యుత్ ఛార్జీలు పెంచకతప్పడం లేదేమో?ఇదే నిజమైతే ఇకపై ఏటా విద్యుత్ చార్జీల వడ్డింపులు ఉన్నా ఆశ్చర్యం లేదు.


Related Post