పౌరసత్వ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

December 12, 2019


img

కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు బుదవారం రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 125, వ్యతిరేకంగా 99 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లుకు పార్లమెంటు ఉభయసభలు ఆమోదించడంతో ఇక రాష్ట్రపతి ఆమోదం లాంఛనప్రాయమేనని చెప్పవచ్చు. రాష్ట్రపతి ఆమోదముద్ర వేయగానే బిల్లు చట్టంగా అమలులోకి వస్తుంది. 

దీని ప్రధాన ఉద్దేశ్యం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో మతపరమైన వేదింపులు ఎదుర్కొని భారత్‌కు శరణార్దులుగా వచ్చిన హిందూ, క్రీస్టియన్, పార్శీ, జైన్, బౌద్ద, సిక్కు మతస్తులకు భారత పౌరసత్వం కల్పించడమని కేంద్రప్రభుత్వం చెపుతోంది. కానీ ఆ దేశాల నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి స్థిరపడిన ఇతర మతస్తులను (ముస్లింలను) గుర్తించి వెనక్కు తిరిగి పంపడం కోసమే బిల్లును తెచ్చారని ప్రతిపక్షాల వాదన. మోడీ ప్రభుత్వం ముస్లింలను లక్ష్యంగా చేసుకొనే ఈ బిల్లును రూపొందించిందని వాదిస్తున్నాయి. 

ఈ బిల్లుపై రాజ్యసభలో నిన్న జరిగిన చర్చలో సభ్యులు అడిగిన ఒక ప్రశ్నకు కేంద్రహోంమంత్రి అమిత్ షా సమాధానమిస్తూ “అవన్నీ అపోహలేనని, భారతీయ ముస్లింలు ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని,” అన్నారు. అంటే భారతీయులు కాని ముస్లింలు స్వదేశాలకు వెళ్ళక తప్పదని చెప్పినట్లే అర్ధం అవుతోంది. 

గత కొన్ని దశాబ్ధాలుగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి కోట్లాది ముస్లింలు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించారు. వారిని ఓటు బ్యాంకులుగా మార్చుకొనేందుకు కొన్ని రాజకీయపార్టీలు వారికి రేషన్,ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి అన్ని గుర్తింపు కార్డులు అందజేయడంతో వారు కూడా భారతీయులుగా చలామణీ అవుతున్నారు. సరిహద్దు రాష్ట్రాలైన ఈశాన్య రాష్ట్రాలలో, జమ్ముకశ్మీర్‌, బీహార్, పశ్చిమబెంగాల్‌తో సహా దేశంలో అనేక రాష్ట్రాలలో కోట్లాదిమంది ఆవిధంగా స్థిరపడ్డారు. ఇప్పుడు వారీనందరినీ వెనక్కు తిప్పి పంపాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. అందుకే వారు... వారి ఓటు బ్యాంకుపై ఆధారపడిన రాజకీయపార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని చెప్పవచ్చు. 

ఈ చట్టంతో మోడీ ప్రభుత్వం దేశప్రజల మద్య పెద్ద చిచ్చు రగిలించబోతోందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఈ బిల్లుపై వినిపిస్తున్న వాదనలలో నిజానిజాలు రానున్నరోజులలో తెలుస్తాయి.


Related Post