ఆర్టీసీ సమ్మె విరమణ

November 25, 2019


img

52 రోజులుగా సాగిన ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నట్లు ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి సోమవారం సాయంత్రం ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఆర్టీసీ కేసు ప్రస్తుతం లేబర్ కోర్టులో ఉంది. అక్కడ మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. కనుక మేధావులు, రాజకీయ పార్టీల సూచనల మేరకు బేషరతుగా సమ్మె విరమించాలని నిర్ణయించాము. ఆర్టీసీ కార్మికులందరూ మంగళవారం ఉదయం 6 గంటలకు వారి వారి డిపోలకు వెళ్ళి విధులకు హాజరుకావలని విజ్ఞప్తి చేస్తున్నాను. రేపటి నుంచి ఆర్టీసీ కార్మికులు విధులలో చేరేందుకు వస్తున్నారు కనుక తాత్కాలిక డ్రైవర్లు, కండెక్టర్లు విధులకు రావద్దని, మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇకనైనా ఆర్టీసీ కార్మికులను బేషరతుగా విధులలోకి తీసుకోవాలని సిఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ రేపు ఆర్టీసీ కార్మికులను విధులలో తీసుకోకపోతే అప్పుడు ఏమి చేయాలో నిర్ణయించుకొంటాము. 

మేము ఆర్టీసీని రక్షించుకొనేందుకే పోరాడాము. 52 రోజులపాటు సాగిన ఈ పోరాటంలో మేము విజయం సాధించలేకపోయినా ఆర్టీసీలో పేరుకుపోయిన సమస్యలను, లోపాలను, జరుగుతున్న అవకతవకలను ప్రజలందరి దృష్టికి తీసుకువెళ్ళగలిగాము. కనుక ఈ పోరాటంలో ఆర్టీసీ కార్మికులు ఓడిపోలేదు... ప్రభుత్వం గెలువలేదు. సమ్మె విరమణ చేసినప్పటికీ ఆర్టీసీ జేఏసీ యధాతధంగా కొనసాగుతుంది. నేటికీ ఆర్టీసీ ఏపీఎస్ ఆర్టీసీలో భాగంగానే ఉంది కనుక దానిని ప్రైవేటీకరించడం సాధ్యం కాదు. కనుక ఆర్టీసీ ప్రైవేటీకరణపై ఆర్టీసీ కార్మికులులెవరూ దిగులు చెందవద్దని కోరుతున్నాను. సమ్మె కాలంలో 29 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోవడం మా అందరికీ చాలా బాధ కలిగించింది. ఆర్టీసీ కార్మికులందరం కలిసి వారి కుటుంబాలను ఆదుకొంటామని హామీ ఇస్తున్నాను,” అని అన్నారు. 

మంగళవారం సాయంత్రం సిఎం కేసీఆర్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి ఆర్టీసీ సమస్యలు, ఆర్టీసీ ప్రైవేటీకరణ, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటికే ప్రతిపక్షాలు, ముఖ్యంగా బిజెపి నేతలు, ఆర్టీసీ కార్మికులు రెండుమూడుసార్లు గవర్నర్‌ను కలిసి ఆర్టీసీ సమస్యను పరిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేసి ఉన్నందున, ఆమె ఆర్టీసీ కార్మికులను విధులలోకి తీసుకోమని సిఎం కేసీఆర్‌కు నచ్చచెప్పి ఉండవచ్చు. కానీ సిఎం కేసీఆర్‌ అందుకు అంగీకరించారో లేదా అనే విషయం రేపు ఉదయం ఆర్టీసీ కార్మికులు డిపోలకు చేరుకొన్నప్పుడు తేలిపోతుంది. వారిని విధులలో తీసుకొన్నా తీసుకోకపోయినా ఆర్టీసీ ప్రైవేటీకరణ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.  



Related Post