మహా సంక్షోభంపై సుప్రీంకోర్టులో నేడు పంచాయతీ

November 25, 2019


img

అక్టోబర్ 24న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి నేటి వరకు అనేక నాటకీయ పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నికలలో కలిసి పోటీ చేసిన బిజెపి (105) శివసేన (56)లకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తగినంత బలం ఉన్నప్పటికీ సిఎం పదవి కోసం ఏర్పడిన ప్రతిష్టంభన కారణంగా అవి విడిపోయాయి. దాంతో కాంగ్రెస్‌(44), ఎన్సీపీ (54) శివసేన (56) కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమయ్యాయి. కానీ ఎవరూ ఊహించనివిధంగా శనివారం తెల్లవారుజామున బిజెపి శాసనసభా పక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ కూడా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అప్పటి నుంచి మహారాష్ట్రలో మళ్ళీ ‘క్యాంప్ రాజకీయాలు’ మొదలయ్యాయి. 

కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన పార్టీలు మహారాష్ట్ర గవర్నర్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషన్‌ వేయడంతో మహా పంచాయితీ సుప్రీంకోర్టుకి మారింది. ఆ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వానికి, మహారాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌లకు నోటీసులు జారీచేసింది. అంతేగాక రాష్ట్రపతి పాలనను ఎత్తివేయమని కోరుతూ మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ కేంద్రానికి వ్రాసిన లేఖను, అలాగే బిజెపిని ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానిస్తూ పంపిన లేఖలను ఈరోజు ఉదయం 10.30 గంటలలోపుగా సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

దీంతో చాలా చకచక్యంగా పావులు కదిపి అధికారం చేజిక్కించుకొన్నామనుకొన్న కేంద్రప్రభుత్వం, సిఎం ఫడ్నవీస్, డెప్యూటీ సిఎం అజిత్ పవార్‌ ఇరకాటంలో పడ్డారు. ఎందుకంటే, శుక్రవారం ఆర్ధరాత్రి దాటిన తరువాత మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను ఎత్తివేసి, శనివారం తెల్లవారుజామున ఫడ్నవీస్, అజిత్ పవార్‌ల చేత హడావుడిగా గవర్నర్‌ ప్రమాణస్వీకారం చేయించారు. కనుక గవర్నర్‌ కేంద్రానికి, బిజెపి (ఫడ్నవీస్) ఎప్పుడు లేఖలు పంపారు? బిజెపికి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బలం లేదని తెలిసి ఎందుకు ఆహ్వానించారు? మరుసటిరోజున కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన పార్టీలు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్దమవుతున్నప్పుడు గవర్నర్‌ అంత గుట్టుగా, హడావుడిగా లేఖలను పంపవలసిన అవసరం ఏమిటి? బిజెపి బలపరీక్షకు కావలసినన్ని రోజులు అవకాశం కల్పిస్తున్నా గవర్నర్‌, కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన పార్టీలకు కనీసం 48 గంటలు సమయం ఎందుకు ఇవ్వలేదు? అని సుప్రీంకోర్టు నిలదీయడం ఖాయం. ఒకవేళ గవర్నర్‌ నిర్ణయం ప్రకారమే ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సుప్రీంకోర్టు అభ్యంతరం చెప్పకపోయినా తక్షణమే బలపరీక్ష జరిపించాలని ఆదేశిస్తే బిజెపి వద్ద 146 మంది ఎమ్మెల్యేలు లేరు కనుక దిగిపోకతప్పదు.


Related Post