నేడు ఆర్టీసీ...రేపు?

November 23, 2019


img

ఆర్టీసీ సమ్మె 50 రోజులకు చేరిన నేపధ్యంలో కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి సిఎం కేసీఆర్‌, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలపై విమర్శలు గుప్పించారు. "బిజెపి సభ్యత్వం కోసం అమిత్ షా తెలంగాణకు వస్తారు కానీ 48,000 మంది ఆర్టీసీ కార్మికులు 50 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోరా? 30 మంది కార్మికులు చనిపోయినా అమిత్ షా స్పందించరా? ఆర్టీసీలో కేంద్రానికి 33 శాతం వాటా ఉన్నప్పుడు ఆర్టీసీ సమస్యతో ఏమీ సంబందం లేనట్లు వ్యవహరిస్తుండటం చాలా బాధాకరం. ఆర్టీసీ సమ్మె విషయంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రెండూ చాలా నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నాయి. ఆర్టీసీకి రూ.3,000 కోట్లు అప్పులు ఉన్నాయి కనుక ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పేయడానికి సిద్దం అవుతున్న కేసీఆర్‌ రూ.30,000 కోట్లు అప్పులున్న హైదరాబాద్‌ మెట్రోను ఏమి చేస్తావు?. ఇకనైనా సిఎం కేసీఆర్‌ మొండిపట్టు వీడి తక్షణం ఆర్టీసీ కార్మికులను విధులలో చేర్చుకోవాలి,” అని రేవంత్‌ రెడ్డి అన్నారు. 

రేవంత్‌ రెడ్డి వాదన సహేతుకమైనదేనని చెప్పవచ్చు. ఆర్టీసీలో కేంద్రానికి 33 శాతం వాటా ఉన్నప్పుడు, ఈ సమస్యతో దానికీ ప్రత్యక్షంగా సంబందం ఉంటుంది కనుక రాష్ట్ర స్థాయిలో ఈ సమస్య పరిష్కారం కానప్పుడు తప్పనిసరిగా కేంద్రం చొరవ తీసుకొని ఉండాలి కానీ కేంద్రం ఇంతవరకు స్పందించలేదు. 

“ప్రభుత్వానికి అప్పులు తిరిగి తీర్చే ఆర్ధికశక్తి ఉందని ఆర్ధిక సంస్థలు బలంగా నమ్ముతున్నందునే అవి అప్పులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయని, కనుక రాష్ట్రాభివృద్ధి కోసం అప్పులు చేయడం తప్పు కాదని సిఎం కేసీఆర్‌ గట్టిగా వాదించి, సుమారు రూ.80,000 కోట్లు అప్పులు తీసుకువచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. 

ఆర్టీసీకున్న రూ. 5-6,000 కోట్ల అప్పులే గుదిబండగా భావిస్తున్నప్పుడు ఆ లెక్కన కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా పెద్ద గుదిబండే అవుతుంది కదా? కనుక దానినీ ప్రైవేట్ సంస్థలకు అప్పగించగలరా? అని ఆలోచిస్తే అప్పుల విషయంలో ప్రభుత్వ వాదనలో డొల్లతనం అర్ధమవుతుంది. 

సంక్షేమ పధకాలపై ప్రభుత్వం ఖర్చు చేస్తున్న వేలకోట్లు ఎన్నటికీ తిరిగిరావని అందరికీ తెలుసు కానీ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసమే ఆ భారాన్ని భరిస్తున్నామని ప్రభుత్వం చెప్పుకొంటుంది. కానీ వాటి వలన ఎన్నికలలో తెరాసకు మేలు కలుగుతుందనే ఊదేశ్యం కూడా ఉందని సిఎం కేసీఆర్‌ స్వయంగా శాసనసభలో చెప్పిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. మరి ఒక్క టీఎస్‌ఆర్టీసీ విషయంలోనే తెరాస సర్కార్‌ అప్పులను బూచిగా చూపించి ఎందుకు వదిలించుకోవాలనుకొంటోంది! ఒకవేళ రాబడి లేదా లాభాలు రానివాటినన్నిటినీ మూసేయాలనుకొంటే మున్ముందు ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న పాఠశాలలు, కాలేజీలను, ప్రభుత్వాసుపత్రులు కూడా వదిలించుకోవలసి వస్తుందేమో? అదే కనుక జరిగితే వాటిపైనే ఆధారపడిన పేద ప్రజల పరిస్థితి ఏమవుతుంది? 


Related Post