కెసిఆర్ ఒకటనుకొంటే...జరుగుతున్నది మరొకటి!

February 05, 2018


img

తెరాస అధికారంలోకి రాగానే రాష్ట్రంలో తెరాసను ఎదురులేని పార్టీగా మలిచి, వచ్చే ఎన్నికలలో అవలీలగా విజయం సాధించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ తన రాజకీయ వ్యూహాలకు పదునుబెట్టి, ‘బంగారి తెలంగాణా కోసం రాజకీయ శక్తుల పునరేకీకరణ’ పేరుతో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను, ముఖ్యనేతలను తెరాసలోకి ఫిరాయింపజేసిన సంగతి తెలిసిందే. తద్వారా అయన ప్రతిపక్షాలను దాదాపు నిర్వీర్యం చేశారు. 

ఆ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ కూడా విలవిలలాడింది కానీ దానిలో కొమ్ములు తిరిగిన అనేకమంది సీనియర్ నేతలు ఉండటంతో ఎదురుదెబ్బలు తట్టుకొని నిలబడగలిగింది. తెరాసను రాజకీయంగా దెబ్బ తీసేందుకు కాంగ్రెస్ కూడా చాలా గట్టి ప్రయత్నాలే చేసింది. తెరాసను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంకు అండగా నిలబడింది. తెరాస సర్కార్ చేస్తున్న తప్పిదాలను అవకాశాలుగా మలుచుకొని పోరాటాలు సాగిస్తోంది. నేరెళ్ళ ఘటన, బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటాలు, నయీం కేసులు, మియాపూర్ భూకుంభకోణం, బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య వంటి ప్రతీ అంశాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని తెరాస సర్కార్ ను గట్టిగా డ్డీ కొంటూ, ‘వచ్చే ఎన్నికలలో మాకు కాంగ్రెస్ పార్టీతోనే పోటీ’ అని మంత్రి కేటిఆర్ చేతే అనిపించుకోగలిగింది.

ఇదివరకు తెరాస ‘బంగారి తెలంగాణా కోసం రాజకీయ శక్తుల పునరేకీకరణ’ పేరుతో ప్రతిపక్ష పార్టీలను బలహీనపరిస్తే, తెరాస సర్కార్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా రాజకీయ శక్తులు చేతులు కలుపుతుండటం విశేషం. వాటిలో కాంగ్రెస్- రేవంత్ రెడ్డి-ప్రొఫెసర్ కోదండరాం ఒక వర్గం కాగా, బహుజన వామపక్ష ఫ్రంట్ మరొకటి. వచ్చే ఎన్నికలలో తెరాసను ఎదిరించే పార్టీయే ఉండకూడదని ముఖ్యమంత్రి కెసిఆర్ అనుకొంటే రోజుకొక కొత్త పార్టీ పుట్టుకొస్తూనే ఉన్నాయి. అవన్నీ కెసిఆర్, తెరాస ధాటిని తట్టుకోలేకపోవచ్చు కానీ ఓట్లు చీల్చడం ద్వారా తెరాసకు ఎంతో కొంత నష్టం కలిగించకమానవు. కనుక ఎన్నికలలో వాటన్నిటివలన కలిగే నష్టాన్ని అధిగమించడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఏదైనా కొత్త ఆలోచన చేయవలసి ఉంటుంది. 


Related Post