అమిత్ షా ఏమి అద్భుతం చేస్తారో?

February 02, 2018


img

భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురువారం తెలంగాణా రాష్ట్ర భాజపా నేతలతో డిల్లీలో సమావేశమయ్యారు. వారితో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, పార్టీ పరిస్థితి గురించి చర్చించిన తరువాత రాష్ట్రంలో పార్టీ అనుసరించవలసిన వైఖరిని స్పష్టం చేశారు. 

వచ్చే ఎన్నికలలో భాజపా రాష్ట్రంలో అన్ని శాసనసభ, లోక్ సభ స్థానాలకు ఒంటరిగా పోటీ చేస్తుందని తెలిపారు. కేంద్రమంత్రులు రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు తెరాస పాలనను పొగడటాన్ని తప్పుగా అర్ధం చేసుకోరాదని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య సత్సంబంధాలు నెలకొని ఉండటం అవసరమని అన్నారు. అంతమాత్రన్న మజ్లీస్ పార్టీతో అంటకాగుతున్న  తెరాసతో ఎన్నికల పొత్తులు పెట్టుకొంటామని భావించడం సరికాదని, ఒకవేళ ఎవరైనా ఆ విధంగా అంటే వాటిని ఖండించాలని అన్నారు. తాను తెలంగాణాలో చేయించిన సర్వేలో భాజపాకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని తేలిందని కనుక ఇకపై రాష్ట్ర భాజపా నేతలు అందరూ మరింత హుషారుగా పనిచేయాలని కోరారు. తాను ఈ నెలలోనే మూడు రోజులపాటు తెలంగాణాలో పర్యటనకు వస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో పార్టీని గెలిపించుకొనేందుకు అందరం కలిసి పనిచేద్దామని చెప్పారు. 

తెలంగాణా భాజపా పరిస్థితి చూస్తున్నవారికి ‘రాష్ట్రంలో భాజపా బలంగా ఉందని, భాజపాకు విజయావకాశాలున్నాయని’ అమిత్ షా చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగించకమానదు. బహుశః భాజపా నేతలకు ఉత్సాహం కలిగించడానికే అమిత్ షా ఆవిధంగా చెప్పి ఉండవచ్చు. అయితే కేంద్రమంత్రులే తెరాస సర్కార్ పాలన బాగుందని చెపుతున్నప్పుడు ఇక రాష్ట్ర భాజపా నేతలు తెరాస సర్కార్ పై ఎన్ని విమర్శలు చేస్తే మాత్రం ఏమి ప్రయోజనం? వాటిని ప్రజలు ఎందుకు నమ్ముతారా? తెరాస సర్కార్ పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరితో రాష్ట్ర భాజపా నేతలలో ఒక అయోమయ స్థితిని సృష్టించిందని చెప్పవచ్చు. మరోవిధంగా చెప్పాలంటే రాష్ట్ర భాజపాకు అదే శాపంగా మారిందని చెప్పవచ్చు. ఇక రాష్ట్రంలో తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కనబడుతోంది. వచ్చే ఎన్నికలలో ఆ రెండు పార్టీల మధ్యనే పోటీ ప్రధానంగా ఉంటుంది. భాజపాతో సహా మిగిలిన అన్ని పార్టీలు, కొత్తగా పుట్టుకొస్తున్న పార్టీలు కూటములు ఆ రెండు పార్టీల ఓట్లు చీల్చడానికే పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అమిత్ షా చెప్పినట్లుగా తెలంగాణాలో భాజపా విజయం సాధించాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే. మరి అమిత్ షా అటువంటి అద్భుతమేదైనా చేస్తారేమో చూద్దాం. 


Related Post