తెలుగు రాష్ట్రాల ఆవేదన సహేతుకమే!

February 02, 2018


img

తెలంగాణా ప్రభుత్వం చేపడుతున్న అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇరుగుపొరుగు రాష్ట్రాలే కాక కేంద్రప్రభుత్వం కూడా చాలా మెచ్చుకొంది. అందుకు నిదర్శనంగా అనేకసార్లు కేంద్ర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు రాష్ట్రానికి అనేక అవార్డులు ఇచ్చాయి కూడా. తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కేంద్ర మంత్రులు, అధికారులు పలువేదికలపై బహిరంగంగానే ప్రశంసించారు. 

అంతాబాగానే ఉంది...కానీ మాటలతో కడుపు నిండనట్లే ఆ అభివృద్ధి పనులకు ఊతమిచ్చేవిధంగా బడ్జెట్ లో నిధులు కేటాయింపులు జరుగనప్పుడు అభివృద్ధి ఏవిధంగా సాధ్యం అవుతుంది? ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ నిన్న సమర్పించిన కేంద్ర బడ్జెట్ లో తెలంగాణా రాష్ట్రానికి నిధుల కేటాయింపులో తీరని అన్యాయం చేశారు. ప్రభుత్వ శాఖలవారిగా చేసిన కేటాయింపులలో రాష్ట్రాలకు అవసరమైన నిధులు అందిస్తామని సర్దిచెప్పారు. అయితే ఆ పద్దతిలో నిధులు దక్కించుకోవడానికి అన్ని రాష్ట్రాలు పోటీ పడకతప్పదు. 

ఉదాహరణకు తెలంగాణా రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఆంధ్రాలో పోలవరం ప్రాజెక్టు ఉంది. మిగిలిన రాష్ట్రాలలో కూడా ఇటువంటివే అనేక ప్రాజెక్టుల నిర్మాణాలు వివిధ దశలలో ఉన్నాయి. కనుక వాటి నిర్మాణాలు పూర్తవ్వాలంటే వాటినే ప్రాతిపదికగా తీసుకొని అవసరమైన నిధులు అందించాల్సి ఉంటుంది. కానీ కేంద్ర బడ్జెట్ లో ఆవిధంగా చేయలేదు. తెలంగాణా ప్రాజెక్టులకు బడ్జెట్ లో నిర్దిష్టంగా నిధులు కేటాయించలేదు కనుక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఎంపిలు నిధుల కోసం డిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేయకతప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ప్రాజెక్టులకు తగినన్ని నిధులు కేటాయించకుండా కేవలం శబాషీలు ఇస్తే ఎటువంటి ప్రయోజనమూ ఉండదు.

నిజమే! అన్ని రాష్ట్రాలకు న్యాయం చేస్తూ అందరూ తృప్తిచెందేవిధంగా బడ్జెట్ లో ఉదారంగా నిధులు కేటాయించడం చాలా కష్టమే. కానీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొన్ని రాష్ట్రాలకు ఉదారంగా బారీ నిధులు కేటాయించి, నిధులు అత్యవసరమున్న రాష్ట్రాలకు, ప్రాజెక్టులకు తగినన్ని నిధులు కేటాయించకపోవడం వలననే అందరూ కేంద్రాన్ని వేలెత్తి చూపవలసివస్తోంది. ఉదాహరణకు హైదరాబాద్ మెట్రోకు పైసా విదిలించని మోడీ సర్కార్, బెంగళూరు మెట్రోకు ఏకంగా రూ.17,000 కోట్లు కేటాయించింది. బడ్జెట్ లో ఇటువంటి చిత్రాలు అనేకం ఉన్నాయి.               

దేశంలో ఏదైనా ఒక రాష్ట్రం పారిశ్రామికంగా లేదా వ్యవసాయపరంగా లేదా ఆర్ధికంగా అభివృద్ధి చెందితే అది దేశానికి సంపదను జోడిస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ పలుమార్లు చెప్పారు. అది నిజం కూడా. కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రం నుంచి పన్నుల రూపేణా ఏటా రూ.30,000 కోట్లు కేంద్ర ఖజానాలో జమా అవుతున్నాయి. కనుక రాష్ట్రాభివృద్ధికి కేంద్రం మరిన్ని నిధులు మంజూరు చేసి ఉండి ఉంటే, రాష్ట్రం నుంచి కేంద్రానికి మరింత ఆదాయం సమకూరి ఉండేది. 

ఈవిషయాలన్నీ దేశాన్ని నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి, ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీకి తెలియవనుకోలేము. కానీ సార్వత్రిక ఎన్నికలు ముంచుకు వస్తునందున భాజపాకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి బడ్జెట్ లో కేటాయింపులు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కనుక రెండు తెలుగు రాష్ట్రాల ఆవేదన, ఆగ్రహం, విమర్శలు సహేతుకమే.


Related Post