నేను రాజకీయ సన్యాసానికి రెడీ: కేటిఆర్

January 31, 2018


img

అవును. ఈ మాట అన్నది ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆరే! రాజకీయనాయకుల నోట ఇటువంటి సవాళ్ళు వినబడటం చాలా సహజమే కానీ అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో కూడా మంచి సమర్ధుడని నిరూపించుకొని, ఏదో ఒకనాడు ముఖ్యమంత్రి పీఠం అధిష్టాస్తారని భావిస్తున్న యువనాయకుడు కేటిఆర్ నోట ఈ మాట వినబడటమే విచిత్రంగా ఉంది. 

జోగులంబ గద్వాల్ జిల్లాలో బుధవారం అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటిఆర్ శంఖుస్థాపనలు చేశారు. ఆ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ, “వచ్చే ఎన్నికలలో మళ్ళీ మా పార్టీయే ఖచ్చితంగా గెలుస్తుంది. ఒకవేళ గెలవకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తాను. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలుచుకొంటుందని చెపుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నా సవాలును స్వీకరించగలరా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే అయన రాజకీయ సన్యాసం చేస్తారా? అసలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలుస్తుందో చెప్పగలరా?” అని సవాలు విసిరారు. వచ్చే ఎన్నికలలో నూటికి నూరు శాతం అన్ని నియోజకవర్గాలలో గులాబీ జెండాయే ఎగురబోతోందని కేటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. 

ఈ వయసులో కేటిఆర్ సీనియర్ కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈవిధంగా సవాలు విసరడం చాలా విచిత్రంగానో లేక గొప్పగానో అనిపించవచ్చు కానీ అది తొందరపాటేనని చెప్పక తప్పదు. ఇదివరకు గ్రేటర్ ఎన్నికల సమయంలో కూడా కేటిఆర్ ఇదేవిధంగా తొందరపడి సవాలు విసిరి, ఆ తరువాత ‘తూచ్.. వందసీట్లు గెలవకపోతే కాదు...గ్రేటర్ ఎన్నికలలో గెలవకపోతే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని దానర్ధం’ అని సవరణ ప్రకటన జారీ చేయవలసి వచ్చింది. అయినా ‘రాజకీయ సన్యాసం’ సవాళ్ళు విసరడానికి ఇప్పుడే ఏమి తొందర?


Related Post