తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం హైదరాబాద్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు మా పార్టీ సిద్దంగా ఉంది. వచ్చే ఎన్నికలలో ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తారని భావిస్తున్నాము,” అన్నారు.
సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ప్రతిపక్షాలు ఎన్నికల కోసం చకోరపక్షుల్లా ఎదురుచూస్తూనే ఉంటాయి. ఎన్నికలు వచ్చి వాటిలో గెలిచి...చిన్నదో పెద్దదో ఏదో ఒక పదవి దానితో ఎంతో కొంత అధికారం సంపాదించుకోవలనే తాపత్రయంతోనే ప్రతిపక్షాలు ఎన్నికలకు తహతహలాడుతుంటాయనేది బహిరంగ రహస్యం. తెలంగాణా కాంగ్రెస్ కూడా అందుకు మినహాయింపు కాదు. కనుకనే ముందస్తు ఎన్నికల కలలు కంటోందని భావించవచ్చు. ప్రతిపక్షాలు ఎప్పుడూ ఎన్నికలు రావాలని కోరుకొంటున్నట్లే, అధికారంలో ఉన్న పార్టీ తామే శాస్వితంగా అధికారంలో ఉండిపోవాలని అత్యాశ పడుతుంటాయి. కానీ మన ప్రజాస్వామ్యవ్యవస్థలో ఎప్పుడు ఎన్నికలు జరగాలో అప్పుడే జరుగుతాయి. అవొచ్చినప్పుడు ఎన్నికలను కోరుకొంటున్న ప్రతిపక్షపార్టీలు, వద్దనుకొంటున్న అధికార పార్టీలు కూడా వాటిని ఎదుర్కోక తప్పదు. కనుక అవి అందుకు సిద్దంగా ఉన్నాయో లేవో...వాటి నమ్మకం నిజమవుతుందో లేదో తెలియాలంటే ఎన్నికల గంట మ్రోగాల్సిందే. ఓటరు దేవుళ్ళు కరుణించాల్సిందే.