అయితే...ఉత్తమ్ ఎన్నటికీ గడ్డం తీయలేరా?

January 30, 2018


img

తెలంగాణా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వరుసగా రెండున్నరేళ్ళపాటు రాష్ట్రంలో నిత్యం ఏవో ఒక ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఆ తరువాత ఒక ఏడాది విరామం వచ్చింది కానీ రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ ఆ వేడిని అలాగే కొనసాగిస్తూ 2019 ఎన్నికల పాట పాడటం మొదలుపెట్టేసాయి.

వచ్చే ఎన్నికలలో రెండు తప్ప మొత్తం అన్ని సీట్లు తెరాసయే గెలుచుకోబోతోందని ముఖ్యమంత్రి కెసిఆర్ జోస్యం చెప్పగా, ఇప్పటికిప్పుడు ఎన్నికలువస్తే కాంగ్రెస్ పార్టీ అవలీలగా 70 సీట్లు గెలుచుకోగలదని ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. అంతే కాదు...రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు గడ్డం గీసుకోనని శపథం చేశారు. 

అయితే 70 సీట్లు వస్తాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి పగటి కలలుకంటున్నారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. పదేళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో రాష్ట్రంలో రైతులకు చేసిందేమీ లేకపోయినా, అన్నీ తామే చేశామని గొప్పలు చెప్పుకొంటూ తమ ప్రభుత్వం చేస్తున్న ప్రతీ పనికీ కాంగ్రెస్ నేతలు అడ్డుపడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హయంలో పాలమూరు జిల్లా వలసల జిల్లాగా మారిపోయిందని, అటువంటి వెనుకబడిన అన్ని జిల్లాలపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి శరవేగంగా అభివృద్ధి చేస్తోందని అన్నారు. ఈ మూడున్నరేళ్ళలో తమ ప్రభుత్వం 6.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిందని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వమూ కూడా రాష్ట్రంలో రైతులకు, వ్యవసాయ రంగానికి ఇంతగా మేలు చేయలేకపోయాయని, మరి కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలుచుకొంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏవిధంగా కలలుగంటున్నారని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఇంతగా అభివృద్ధి చేస్తున్న తెరాస సర్కార్ కే ప్రజలు మళ్ళీ పట్టం కట్టడం ఖాయం అని  గెలిపించడం ఖాయమని మంత్రి హరీష్ రావు అన్నారు. 

తమ ప్రభుత్వం చేసిన, చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ప్రజలు ఓట్లు వేస్తారనే తెరాస వాదన సహేతుకంగానే ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎందుకు ఓట్లు వేసి గెలిపించాలో లేదా గెలిపిస్తారని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారో బలమైన కారణాలు చెప్పవలసి ఉంది లేకుంటే మంత్రి హరీష్ రావు చెప్పినట్లు 70 సీట్లు వస్తాయని పగటి కలలు కంటున్నట్లే భావించవలసి ఉంటుంది.


Related Post