అరుణాచలంకు టిజిఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీసులు

November 07, 2024
img

ఈ నెల 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఏటా వేలాదిమంది భక్తులు అరుణాచలం వెళుతుంటారు. కనుక వారి సౌకర్యార్ధం టిజిఎస్‌ఆర్టీసీ అరుణాచలంకి ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. 

హైదరాబాద్‌, మెదక్, నల్గొండ, వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, మహబూబ్ నగర్‌, ఆదిలాబాద్‌ నుంచి ఈ ప్రత్యేక బస్ సర్వీసులు నడుస్తాయని టిజిఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. ఈ నెల 13వ తేదీ నుంచి ఈ ప్రత్యేక బస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

టిజిఎస్‌ఆర్టీసీ నడిపిస్తున్న ఈ ప్రత్యేక బసులలో టికెట్స్ బుక్ చేసుకున్నట్లయితే దారిలో కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, వెల్లూరులో గల గోల్డెన్ టెంపుల్‌ సందర్శన చేసుకొని అరుణాచలం వెళ్ళి రావచ్చు.

కార్తీకపౌర్ణమి రోజున టిజిఎస్‌ఆర్టీసీ బస్సులు అరుణాచలం చేరుకుంటాయి. భక్తులు గిరిప్రదక్షిణ ముగించుకొని స్వామివారిని దర్శించుకొని వచ్చిన తర్వాత మళ్ళీ అవే బస్సులలో స్వస్థలాలకు నిశ్చింతగా క్షేమంగా చేరుకోవచ్చు.

కనుక తెలంగాణ నుంచి అరుణాచలం వెళ్ళే భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవలసిందిగా టిజిఎస్‌ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది.

ఈ ప్రత్యేక బస్ సర్వీసులలో టికెట్స్ బుకింగ్స్, టైమింగ్స్ తదితర వివరాల కోసం టిజిఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసింది. 040-23450033,040-69440000 ఫోన్‌ నంబర్లకు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చు. లేదా టిజిఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

Related Post