మహిళా రెజ్లర్ల పోరాటానికి రైతు సంఘాల మద్దతు

May 31, 2023
img

భారత్‌కు పతకాలు సాధించిన మహిళా రెజ్లర్లకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్రమోడీలు సానుభూతి చూపలేకపోయారు కానీ హరిద్వార్‌లో రైతు సంఘాలు సానుభూతి చూపాయి. తమతో అసభ్యంగా వ్యవహరిస్తున్న ఎంపీ, రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. బ్రిజ్ భూషణ్ కూడా రాజీనామా చేసేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో మహిళా రెజ్లర్లు తమ ఆందోళన ఉదృతంగా చేయగా ఢిల్లీ పోలీసులు వారితో దౌర్జన్యంగా వ్యవహరించారు. 

ఈ వార్తలు దేశవిదేశాల మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. భారత్‌కు పతకాలు సాధించిన మహిళా రెజ్లర్ల పట్ల ఇంత అమానుషంగా వ్యవహరించడాన్ని, వారితో అనుచితంగా వ్యవహరించిన బ్రిజ్ భూషణ్‌ని కేంద్ర ప్రభుత్వం వెనకేసుకువస్తుండటాన్ని యావత్ దేశ ప్రజలు, ముఖ్యంగా మహిళలు తప్పు పడుతున్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. తాము ఎంతగా ఆందోళనలు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో, మహిళా రెజ్లర్లు తాము సాధించిన పతకాలను హరిద్వార్‌ వద్ద గంగానదిలో పడేసేందుకు సిద్దమయ్యారు. 

అయితే ఈ విషయం తెలుసుకొన్న రైతు సంఘాల నేత నరేష్‌ తికాయత్ అక్కడకు చేరుకొని వారికి నచ్చజెప్పి అడ్డుకొన్నారు. ఎంతో కష్టపడి సాధించుకొన్న పతకాలను గంగపాలు చేయవద్దని, అందరం కలిసి పోరాడుదామని నచ్చజెప్పడంతో వారు ఆ ప్రయత్నం విరమించుకొన్నారు. 

ఈ సందర్భంగా మహిళా రెజ్లర్లు తాము ఆ పతకాలు సాధించడానికి ఎంత కష్టపడ్డామో, బ్రిజ్ భూషణ్ తమతో ఏవిదంగా అనుచితంగా ప్రవర్తించేవాడో చెప్పుకొని కన్నీళ్ళు పెట్టుకొన్నారు. ఈ పతకాలు సాధించినప్పుడు తమను ప్రశంశించిన కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు తమ పట్ల ఇంత నిర్లిప్తంగా వ్యవహరించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, ఇది ఇంకా అవమానకరంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారికి రైతు సంఘాల నేతలు సంఘీభావం తెలిపి బ్రిజ్ భూషణ్‌పై చర్యలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వానికి 5 రోజులు గడువు విధించారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే రైతు సంఘాలు కూడా మహిళా రెజ్లర్ల తరపున ఆందోళన చేపడతాయని హెచ్చరించారు.

Related Post