ఇన్‌సర్వీస్‌ టీచర్లకు టెట్‌ పరీక్షల షెడ్యూల్‌ జారీ

August 29, 2026


img

తెలంగాణలో ఇన్‌సర్వీస్‌ టీచర్లకు నిర్వహించనున్న ప్రత్యేక టెట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. సెప్టెంబర్‌ 8,9 తేదీలలో ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2  గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. 

మొదటి రోజున తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో పేపర్-1, పేపర్-2 పరీక్షలు జరుగుతాయి. రెండో రోజున అంటే సెప్టెంబర్‌ 9న ఉర్దూతో సహా ఇతర మీడియంలో పేపర్-2 పరీక్షలు జరుగుతాయి. 

రాష్ట్రంలో మొత్తం 24,983 మంది ఇన్‌సర్వీస్‌ టీచర్లు ఈ పరీక్షలకు హాజరు కాబోతున్నారు. వీటికి సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌: https://schooledu.telangana.gov.in సందర్శించవచ్చు.  

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రస్తుతం విధుల్లో ఉన్న ఇన్‌సర్వీస్‌ టీచర్ల కోసం టెట్‌ అర్హత సాధించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా టెట్‌ నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ పూర్తయింది.

ఇన్‌సర్వీస్‌ టీచర్లు తప్పనిసరిగా టెట్‌లో అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే తొలి ప్రయత్నంలోనే అందరూ అర్హత సాధించలేకపోవచ్చు. కనుక 2028, ఆగస్టు 31 వరకు గడువు ఇచ్చింది. ఆలోగా ప్రతి రాష్ట్రం ఏడాదికి రెండుసార్లు టెట్‌ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

కనుక వచ్చే నెలలో జరుగబోయే టెట్‌ పరీక్షలో అర్హత సాధించలేకపోయిన ఇన్‌ సర్వీస్ టీచర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వారి కొరకు ఆరు నెలల్లోగా మరోసారి పరీక్ష నిర్వహిస్తుంది. 


Related Post