రాయదుర్గంలో ఎకరం రూ. 269 కోట్లు!!!

August 29, 2026


img

హైదరాబాద్‌లో భూముల ధరలు కనీవినీ ఎరుగనంతగా పెరిగాయి. రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో 5.38 ఎకరాల భూమిని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టిజిఐఐసి) ఈ-వేలంలో కనీస ధరే రూ.175 కోట్లుగా నిర్ణయించడం దిగ్బ్రాంతి కలిగిస్తుంటే, ఈ వేలం పాటలో పాల్గొన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా పోటా పోటీగా ధర పెంచేశాయి.

చివరకు వంశీ రామ్‌ బిల్డర్స్ రూ.269 కోట్లకు ఎకరం దక్కించుకుంది. ఇదే రాయదుర్గంలో గత వారం నిర్వహించిన వేలంలో ఎకరం రూ.264 కోట్లకు అమ్ముడైంది. వారం రోజుల వ్యవధిలోనే ధర 5 కోట్లు పెరిగింది. వేలంపాట కనీస ధరతో పోలిస్తే సుమారు 53 శాతం అధికంగా వచ్చింది.

ఈ వేలంపాటలో 5.38 ఎకరాలకు మొత్తం రూ.1,447.22 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో ఇప్పటి వరకు ఒక్క రాయదుర్గం భూముల వేలంపాట ద్వారానే ప్రభుత్వానికి రూ.2,833.22 కోట్ల ఆదాయం సమకూరింది. 

ఒకప్పుడు హైదరాబాద్‌లో ఎకరం భూమికి కోటి, రెండు కోట్లు వస్తేనే పెద్ద ధర అనుకునేవారు. కేసీఆర్‌ హయంలో కోకాపేటలో ఎకరం రూ. 101 కోట్లుకి వెళ్ళినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఏకంగా ఎకరం రూ.269 కోట్లకు అమ్ముడైంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏ స్థాయికి చేరిందో ఇది తెలియజేస్తోంది. 


Related Post