భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ హామీ నిలుపుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లతో భద్రాచలం అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది.
తొలి దశలో రూ.200 కోట్ల వ్యయంతో ఆలయ పరిసర ప్రాంతాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆలయం చుట్టూ ఉన్న పాత భవనాల తొలగింఛి ఆలయ పరిసరాలను విస్తరిస్తారు.
భక్తుల సౌకర్యార్ధం ఆధునిక క్యూ కాంప్లెక్స్‌లు, కాటేజీలు నిర్మిస్తారు. , పార్కింగ్ స్థలాలు విస్తరించి ఆలయ పరిసర ప్రాంతాలలో సుందరీకరణ పనులు చేపట్టనున్నారు.
త్వరలో పనులు ప్రారంభించి వచ్చే ఏడాది శ్రీరామ నవమి నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనలో భద్రాచలం ఆలయం తెలంగాణకు, తిరుమల ఆంధ్రాకు దక్కినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ రెండు ప్రసిద్ద ఆలయాలను తరచూ దర్శించుకుంటూనే ఉంటారు.
ముఖ్యంగా ఆంధ్రా, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుంటారు. కనుక భక్తుల సౌకర్యార్ధం భద్రాచలం విస్తరణ, అభివృద్ధి అనివార్యమే.