ఇటీవల పాతబస్తీలోని యాకుత్‌పురాలో హైడ్రా సిబ్బంది ఓ మ్యాన్ హోల్ తెరిచి డ్రైనేజ్ పూడిక తీశారు. కానీ మ్యాన్ హోల్ మూత పెట్టకుండా వెళ్ళిపోయారు. తెరిచి ఉన్న మ్యాన్ హోల్లో ఆరేళ్ళ బాలిక పడిపోయింది.
కానీ అదృష్టవశాత్తు ఆ బాలిక తల్లి వెంటనే స్పందించి బయటకు తీసింది. లేకుంటే ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాలువలో ఆ చిన్నారి కొట్టుకుపోయి చనిపోయేదే. అక్కడే ఉన్న సీసీ కెమెరాలలో ఈ దృశ్యాలు రికార్డింగ్ అవడంతో ఆ వీడియోలు సోషల్ మీడియాలోకి వచ్చేశాయి. అవి వైరల్ అవడంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ ఘటనకు బాధ్యత తీసుకోవలసిన హైడ్రా దీంతో తమకు ఎటువంటి సంబంధం లేదని జీహెచ్ఎంసీ లేదా జలమండలి సిబ్బండితే తప్పని వాదించింది. దాంతో జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు కూడా తమకు సంబంధం లేదంటూ తప్పుమీదంటే మీదని పరస్పరం ఆరోపించుకున్నాయి.
ఈ వ్యవహారం అంతా సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి రావడంతో ఆయన అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో హైడ్రా కమీషనర్ రంగనాథ్ వెనక్కు తగ్గి యాకుత్‌పురా ఘటనపై దర్యాప్తు చేయించామని, తమ సిబ్బంది అక్కడ పనిచేసి మ్యాన్ హోల్ మూతపెట్టకుండా వెళ్ళిపోయినట్లు గుర్తించామని చెప్పారు. సదరు సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని రంగనాథ్ చెప్పారు.