ఈరోజు శాసనసభలో సిఎం రేవంత్ రెడ్డికి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌కి మద్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “మీరు అధికారంలో ఉన్నప్పుడు డ్రోన్ ఎగరేసినందుకు ఎంపీగా ఉన్న నన్ను జైల్లో పెట్టారు.
రూ.500 జరిమానా విధించే ఆ కేసుని సీరియస్ కేసుగా మార్చి నన్ను జైల్లో పెట్టారు. నా కూతురు పెళ్ళి చేసుకోవడానికి నేను బెయిల్ తీసుకొని బయటకు రావలసి వచ్చింది. నేను కూడా మీలాగే రాజకీయ కక్ష సాధించాలని అనుకుంటే ఈపాటికి కేసీఆర్, కేటీఆర్‌తో సహా బిఆర్ఎస్ నేతల్లో చాలా మంది జైల్లో ఉండేవారు.
నా గురించి మీరు ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నా పట్టించుకోకుండా వదిలేస్తున్నాను. కానీ నా సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని బిఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలి ,” అని అన్నారు.
కేటీఆర్ స్పందిస్తూ, “మేము తెలంగాణ కోసం పోరాటాలు చేసి జైలుకి వెళ్ళామని గర్వంగా చెప్పుకుంటాము. కానీ మీరేమైనా స్వాతంత్ర్య పోరాటం చేసి జైలుకి వెళ్ళారా?
మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా? డ్రోన్ కెమెరాలతో ఇష్టం వచ్చిన్నట్లు మీ ఇంట్లోవాళ్ళ ఫోటోలు, వీడియోలు తీస్తామంటే మీరు ఊరుకుంటారా?
ముఖ్యమంత్రి అంటే ఏమైనా చేయవచ్చని మీరనుకుంటున్నారు. కానీ మీకు కొన్నిపరిమితులు ఉంటాయి. ముఖ్యమంత్రి ఎవరినీ జైలుకి పంపించలేడు. కోర్టులు మాత్రమే పంపించగలవు. ముఖ్యమంత్రి పదవి శాశ్వితం కాదని గ్రహిస్తే మంచిది,” అని ఘాటుగా బదులిచ్చారు.