20 మంది విద్యార్ధులుంటే పాఠశాల

July 05, 2025
img

తెలంగాణ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలని వారి తల్లితండ్రులు ఇంటికి చాలా దూరంగా ఉండే పాఠశాలలకు పంపలేక చదువులు మాన్పించేస్తున్నారని, దీని వలన పాఠశాల దశలోనే డ్రాపవుట్స్ ఎక్కువయ్యాయని ప్రభుత్వం గుర్తించింది. కనుక అటువంటి పేద విద్యార్ధుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

ఇక నుంచి పట్టణ, గ్రామీణ శివారు ప్రాంతాలలో కనీసం 20 మంది విద్యార్ధులున్న చోట ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 

ఈవిదంగా పట్టణ ప్రాంతాలలో 359, గ్రామీణ ప్రాంతాలలో 212 ప్రభుత్వ పాఠశాలలు అవసరమని అధికారుల నివేదిక సమర్పించారు. 

ఆ నివేదికలో పేర్కొన్న విదంగా వీలైనంత త్వరగా ఆయా ప్రాంతాలలో కొత్తగా ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయాలని విద్యా డైరెక్టర్ డీఈవో, మండల విద్యాశాఖాధికారులను ఆదేశించారు. 

ఈ అదనపు పాఠశాలల కోసం ఇప్పటికిప్పుడు ఉపాధ్యాయులను భర్తీ చేయడం సాధ్యం కాదు కనుక సమీప పాఠశాలలో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను ఈ కొత్త పాఠశాలకు బదిలీ చేయాలని ఆదేశించారు. 

ఇది చాలా మంచి నిర్ణయమే కానీ ఒకేసారి 571 కొత్త పాఠశాలల ఏర్పాటుకి అవసరమైన భవనాలు, ఫర్నీచర్, పరికరాలు వగైరా సమకూర్చుకోవడం చాలా కష్టమే. కనుక కొత్త పాఠశాలలను ఏవిదంగా ఏర్పాటు చేయబోతున్నారో చూడాలి.

Related Post