జగన్ మోడీని కలిస్తే తెదేపా ఎందుకు ఉలికిపడుతోంది?

May 12, 2017


img

చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీని కలిస్తే ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడేందుకేనని వైకాపా నేతలు ఆరోపిస్తుంటారు. జగన్ ప్రధానిని కలిస్తే అక్రమాస్తుల కేసుల నుంచి బయటపడేందుకేనని తెదేపా నేతలు వాదిస్తుంటారు. 

ఈసారి కూడా జగన్ ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు తెదేపా నేతలు అవే ఆరోపణలు చేశారు. వాటిపై  వైకాపా ఎమ్మెల్యే రోజా స్పందిస్తూ, “జగన్ ప్రధానిని కలిస్తే తెదేపా నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? ప్రదాన ప్రతిపక్ష నేత ప్రజా సమస్యల గురించి ప్రధానితో మాట్లాడితే తప్పేమిటి?” అని ప్రశ్నించారు.       

తెదేపా, వైకాపాల విమర్శలు వారిలో అభ్రద్రతాభావానికి నిదర్శనమని చెప్పవచ్చు. ఎందుకంటే, తనకు పక్కలో బల్లెంలాగ తయారైన జగన్మోహన్ రెడ్డిని వదిలించుకోవాలని చంద్రబాబు భావించడం సహజమే. కనుక ఆయన ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు అక్రమాస్తుల కేసులలో తనను జైలుకు పంపమని ఎక్కడ ఒత్తిడి చేస్తారో? అనే భయం జగన్ కు ఉండవచ్చు. కనుక అప్పుడు వైకాపా నేతలు ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడుతుంటారు.

అలాగే జగన్ డిల్లీ వెళ్ళిన ప్రతీసారి కేంద్రమంత్రులకు, ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలకు, జాతీయ మీడియాకు చంద్రబాబు నాయుడు గురించి, తెదేపా ప్రభుత్వం గురించి చెడ్డగా మాట్లాడటం, అవినీతి ఆరోపణలు చేయడం జగన్ కు అలవాటు. ఈసారి కూడా జగన్ అదే పని చేశారు. కనుక చంద్రబాబు అసహనం చెందడం సహజమే. అదీగాక భాజపా తమకు మిత్రపక్షంగా, భాగస్వామిగా ఉన్నప్పుడు, తమను ఇబ్బంది పెడుతున్న తమ ప్రత్యర్ధి జగన్మోహన్ రెడ్డికి ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు అడిగినప్పుడల్లా అపాయింట్మెంట్ ఇవ్వడం, తమపై జగన్ చేస్తున్న పిర్యాదులను సావకాశంగా వింటుండటం తెదేపా జీర్ణించుకోవడం కష్టమే. కానీ ఈ విషయం తెదేపా నేరుగా బయటకు చెప్పుకోలేదు కనుక జగన్ అక్రమాస్తుల కేసుల మాఫీ కోసమే మోడీ కాళ్ళు పట్టుకొంటున్నారని ఆరోపిస్తుంటారు. 

తెదేపా ఆందోళనకు మరో బలమైన కారణం కూడా ఉంది. రాష్ట్ర స్థాయిలో తెదేపా-భాజపాల మద్య అంత బలమైన అనుబందం లేదు కనుక  జగన్ తో కేంద్రం చేతులు కలుపుతుందేమోననే ఆందోళన కూడా తెదేపా నేతల చేత ఈవిధంగా మాట్లడిస్తోందని భావించవచ్చు. జగన్ ఆశిస్తున్నది కూడా అదే కనుక ప్రధాని నరేంద్ర మోడీ తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం, తనతో సుమారు గంటసేపు మాట్లాడటం గురించి వైకాపా నేతలు కాస్త గట్టిగానే నొక్కి చెపుతున్నారు. 


Related Post