రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్న మాట వాస్తవమే. అలాగే రాష్ట్రంలో తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్న మాట కూడా వాస్తవమే. అయితే దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితులు కూడా రాష్ట్రంలో నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. మిర్చి, వరి, కంది రైతుల సమస్యలు, ఆ కారణంగా నిత్యం రైతుల ఆత్మహత్యలు చేసుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు.
సూర్యాపేట జిల్లాలో మేళ్ళచెరువు గ్రామానికి చెందిన మిర్చి రైతు నరాలశెట్టి చిన రామయ్య (65)మిర్చికి గిట్టుబాటు ధర రానందున మనస్తాపం చెంది మే 5న తన పొలంలో పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆదిలాబాద్ జిల్లాలోని గుది హత్నూర్ మండల కేంద్రంలోని కాగ్నే నారాయణ (55) అనే మరో రైతు కూడా ఇదే కారణంతో తన ఇంట్లో ఎవరు లేని సమయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారమే ఇంతవరకు 846 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారని తెలుస్తోంది. కానీ ఆ సంఖ్య కనీసం రెట్టింపు ఉంటుందని రైతు సంఘాలు చెపుతున్నాయి. ఈ గణాంకాలు రాష్ట్రంలో రైతుల దుస్థితికి అద్దం పడుతోంది.
ఒకవైపు మిర్చి రైతులు వరుసగా ఆత్మహత్యలు చేసుకొంటుంటే, వారిని ఆదుకోవలసిన తెరాస, భాజపాలు మీది తప్పంటే..కాదు మీదే తప్పు అంటూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకొంటూ కాలక్షేపం చేస్తుండటం చాలా శోచనీయం. సున్నితమైన ఇటువంటి సమస్యలను తక్షణమే పరిష్కరించే ప్రయత్నాలు చేయకపోగా దీనిని కూడా ఒక రాజకీయ కాలక్షేపంగా మార్చుతుంనందుకు ప్రజలకు తమపై ఆగ్రహం కలుగవచ్చని తెరాస, భాజపాలు గ్రహించకపోవడం విచిత్రమే.
తెరాస, భాజపా నేతలు ఒకరినొకరు నిందించుకొంటూ కాలక్షేపం చేస్తుంటే, కాంగ్రెస్ నేతలు ఆ రెండు పార్టీలను, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను నిందిస్తూ కాలక్షేపం చేసేస్తోంది. ఈ మూడు రాజకీయ పార్టీలు రాజకీయ చదరంగం ఆడుకొంటుంటే, పాపం.. మిర్చి రైతులు తాము చేయని తప్పుకి ప్రాణాలు కోల్పోతున్నారు.
ఒకప్పుడు పత్తి రైతులు, తరువాత చేనేత కార్మికులు..ఇప్పుడు మిర్చి రైతులు..నిత్యం ఈ ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఒకప్పుడు ఆంధ్రా పాలకులు హయంలో మన రైతుల పట్ల వారు వివక్ష చూపేవారు కనుక ఆత్మహత్యలు చేసుకొనేవారు. కానీ ఇప్పుడు మనల్ని మనమే పరిపాలించుకొంటున్నా రాష్ట్రంలో ఇంకా అదే పరిస్థితి ఎందుకు నెలకొని ఉంది? రోజుకు ఒకరిద్దరు రైతన్నలు ఆత్మహత్యలు చేసుకొంటుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? ప్రభుత్వంలో వారిని అదుకొనే నాధుడే లేడా?