ఈ కరోనా కధకు ముగింపు ఎప్పుడో?

April 10, 2020


img

యావత్ ప్రపంచదేశాలలో ఇప్పుడు ఒకటే మాట వినబడుతోంది. అదే...కరోనా..కరోనా...కరోనా! అలనాడు వామనుడు కాలితో ముల్లోకాలను ఆక్రమించేసినట్లు కంటికి కనిపించని కరోనా యావత్ ప్రపంచాన్ని ఆక్రమించేసింది. అదిప్పుడు ప్రపంచదేశాలలో సృష్టిస్తున్న విధ్వంసం చూస్తుంటే ఇంకా ఎంతమంది దానికి బలవ్వాలి?ఎప్పటికైనా కరోనా మహమ్మారి నుంచి బయటపడతామా...లేదా? బయటపడ్డాక ఈ ప్రపంచం మళ్ళీ ఇలాగే ఉంటుందా..లేక కరోనా భయంతో ఎప్పటికీ ఇలాగే సాటిమనిషిని...వస్తువులను... జంతువులను చూస్తూ భయంభయంగా బ్రతకాల్సి ఉంటుందా?వంటి అనేక సందేహాలు కలుగుతున్నాయి. వాటికి కాలమే సమాధానం చెపుతుంది. కానీ అసలు ఈ కరోనా ఎప్పుడు ఏవిధంగా పుట్టింది?అది ప్రపంచమంతా ఇంతవేగంగా ఎలా వ్యాపించింది? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానాలు దొరికాయి. 

యావత్ ప్రపంచం 2020 సంవత్సరంలోకి అడుపెట్టేందుకు ఆత్రంగా ఎదురుచూస్తుంటే దక్షిణ చైనాలోని హుబేయి ప్రావిన్స్ వూహాన్ నగరంలో గల ఓ చేపలమార్కెట్లో 36 మందికి న్యూమోనియా జ్వరం సోకినట్లు చైనా ప్రభుత్వం గుర్తించింది. ఆనవాయితీ ప్రకారం చైనా ప్రభుత్వం ఆ సమాచారాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థకు తెలియజేయడం, దానిని యాదృచ్ఛికంగా స్వీకరించడం జరిగింది. 

ఆ తరువాత ఒక వారం పది రోజులకు వూహాన్ నగరంలో జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. జనవరి 20 వ తేదీకి ఆ సంఖ్య శరవేగంగా పెరిగిపోవడంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే చేపలమార్కెట్లన్నిటినీ మూసివేసి, జనవరి 23న వుహాన్‌ నగరంలో లాక్‌డౌన్‌ ప్రకటించింది. అయితే అప్పటికే కరోనా వైరస్ వూహన్ దాటి చైనాలో ఇతర రాష్ట్రాలలోకి ప్రవేశించింది. అదే సమయంలో వూహాన్‌తో సహా చైనాలో కరోనా ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళిన విదేశీయులతో, విదేశాలలో స్థిరపడి ఈ మద్యకాలంలో చైనా వచ్చి వెళ్ళివచ్చినవారితో కలిసి కరోనా కూడా విమానాలెక్కి సముద్రాలు దాటి విదేశాలకు చేరుకొంది. 

కానీ అప్పటికీ చాలా దేశాలు కరోనా తీవ్రతను గుర్తించలేకపోవడంతో ప్రమాదం గుర్తించేలోగానే కరోనా 209 దేశాలలోకి పాకిపోయింది. ఇరాన్, ఇటలీ, స్పెయిన్, అమెరికా వంటి దేశాలు దానిని మొదట చాలా తేలికగా తీసుకోవడంతో ఆవిప్పుడు దానికి బారీ మూల్యం చెల్లిస్తున్నాయి. 

ప్రపంచ ఆరోగ్యసంస్థ తాజా లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 14,39,516 మందికి కరోనా వైరస్ సోకగా వారిలో 85,711 మంది ఈ మహమ్మారికి బలైపోయారు. ఇంకా ప్రతీరోజు వేలాదిమంది బలవుతూనే ఉన్నారు.

ఈ భూమండలం మీద యావత్ మానవాళి, పశుపక్ష్యాదుల ఉనికినే ప్రశ్నార్ధకంగా మార్చివేస్తున్న ఈ కరోనా వైరస్‌తో యావత్ ప్రపంచదేశాలు ఇంకా పోరాడుతుంటే, చైనా మాత్రం కరోనా నుంచి బయటపడి ఏప్రిల్ 8వ తేదీన వూహాన్‌లో లాక్‌డౌన్‌ ఎత్తివేసి మళ్ళీ యధాప్రకారం ఉత్పత్తి, వ్యాపారవాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది.  

భారత్‌కు కూడా మొదట విదేశాల నుంచే కరోనా దిగుమతి అయ్యింది. భారత్‌ దానిని సకాలంలోనే గుర్తించి అడ్డుకోగలిగింది కానీ డిల్లీ మర్కజ్‌ కేసులను గుర్తించడంలో జరిగిన చిన్న ఆలస్యం వలన భారత్‌ కూడా భారీ మూల్యం చెల్లిస్తోంది. 130 మంది జనాభా ఉన్న భారత్‌ కరోనాకు వైద్యం చేయడం కంటే అది వ్యాపించకుండా అడ్డుకోవడమే సులువని భావించి ఏప్రిల్ 14వరకు మూడు వారాలు లాక్‌డౌన్‌ ప్రకటించింది. కానీ ఇంకా నానాటికీ కరోనా కేసులు పెరిగిపోతుండటంతో మరో రెండుమూడువారాలు లాక్‌డౌన్‌ చేయక తప్పదని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.  కానీ అప్పటికైనా భారత్‌లో కరోనా కేసులు ఆగుతాయా లేదా? ఆగకపోతే భారత్‌ పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలకు మరో నెలరోజులలో సమాధానం లభించవచ్చు.


Related Post