కరోనా సోకకుండా ఈ జాగ్రత్తలు పాటించండి

March 28, 2020


img

కంటికి కనబడని కరోనా వైరస్‌తో అమెరికాతో సహా యావత్ ప్రపంచదేశాలు గజగజవణికిపోతున్నాయి. శనివారంనాటికి ప్రపంచంలో 5,96, 852, భారత్‌లో 873 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు కరోనా మహమ్మారిన పడి 27, 370 మంది చనిపోయారు. కనుక రోజూ వార్తలలో ఏ దేశంలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు నమోదు అయ్యాయి? ఎంతమంది చనిపోయారు? అనేదే ఇప్పుడు ప్రధానవార్తలుగా మారిపోయాయి. 

కరోనాకు ఇంతవరకు తగిన మందులు కనుగొనలేదు కనుక అది సోకకుండా జాగ్రత్తపడటమే ఏకైక ఉపాయం అని యావత్ ప్రపంచదేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించి దాదాపు అన్ని వ్యవస్థలను స్తంభింపజేసుకొన్నాయి. అయినప్పటికీ కరోనా వ్యాప్తి నిలిచిపోలేదు. అందుకు కారణం ప్రజలలో ఇంకా అలసత్వం లేదా అవగాహనారాహిత్యమేనని చెప్పకతప్పదు. ఒకవేళ భారత్‌లో పరిస్థితులు అదుపుతప్పితే కనీసం 20 కోట్లు మంది చనిపోయే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిందని సిఎం కేసీఆర్‌ తెలిపారు. కనుక అందరూ ఏప్రిల్ 14వరకు క్వారంటైన్‌లో ఉండటం చాలా అవసరం. కరోనా సోకకుండా ఉండేందుకు వైద్యనిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలు: 

1. లాక్‌డౌన్‌ ఎత్తివేసే వరకు ఎవరూ ఇళ్ళలో నుంచి బయటకు వెళ్లరాదు. 

2. కరోనా లక్షణాలతో క్వారంటైన్‌లో ఉన్నవారికి వీలైనంత దూరంగా ఉండాలి. 

3. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోటికి రుమాలు లేదా రెండు అరచేతులను అడ్డుపెట్టుకోవాలి. అలాగే దౌఊగుతున్నవారికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది. 

4. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని కరోనా వైద్యకేంద్రాలను సంప్రదించడం మంచిది. లేకుంటే మనమే ఇంట్లో వారికి, చుట్టుపక్కల వారందరికీ కూడా కరోనాను అంటించినవారం అవుతాము. 

5. వృద్ధులు, చిన్న పిల్లలను బయటకు వెళ్ళనీయవద్దు. వీలైనంతవరకు వారికి కాస్త దూరంగా ఉంటూ మాట్లాడటం మంచిది. ఎందుకంటే ముందుగా వారికే కరోనా వ్యాపించే ప్రమాదం ఉంది కనుక.  

6. అందరూ రోగనిరోధక శక్తిని పెంచే తాజా ఆహారం, పండ్లు, ఆకుకూరలు తినాలి.

7. బయట హోటల్స్ నుంచి భోజనాలు, టిఫిన్స్, స్వీట్లు, హాట్లు, పిజ్జాలు, బర్గర్లు, బ్రెడ్ వంటివాటికి కొన్ని రోజులు  దూరంగా ఉంటే మంచిది.  

8. అలాగే కూల్ డ్రింక్స్, బయట దుకాణాలలో అమ్మే పళ్లరసాలు, ఐస్‌క్రీమ్స్, ఫ్రొజన్ ఫుడ్స్ వంటి చల్లటి పదార్ధాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. వాటికి బదులు వేడి టీ, కాఫీ, గోరువెచ్చని నీళ్ళు, వీలైతే నిమ్మకాయ రసం కలుపుకొని బ్లాక్ లేదా గ్రీన్ టీ త్రాగడం మంచిది. వేడి ద్రావకాలను సేవించడం వలన గొంతులో వ్యాధికారకాలు నశించిపోతాయి లేదా కడుపులో జీర్ణ వ్యవస్థలో నాశనం అయిపోతాయి.       

9. రోజూ వీలైనన్నిసార్లు ఉప్పు లేదా పసుపు వేసిన గోరువెచ్చని నీళ్ళు త్రాగుతుండాలి. వాటితో నోటిని పుక్కిలించుకొంటే గొంతులో ఉండే వ్యాధి కారకాలు నశించిపోతాయి. 

10. బయట నుంచి వచ్చే కూరగాయలు, ఆకుకూరలు వగైరా బాగా కడిగి ఆరబెట్టిన తరువాతే వాడుకోవాలి. పాల ప్యాకెట్లు, బిస్కట్స్, చిప్స్ వంటి ప్యాకెట్లతో సహా ప్రతీదానిని సబ్బు నీళ్ళు లేదా మరేదైనా ద్రావకంతో తడిపిన గుడ్డముక్కతో తుడిచిన తరువాతే విప్పి వాడుకోవాలి. 

11. బయట నుంచి వచ్చేవారు కాలింగ్ బెల్ నొక్కుతుంటారు. తలుపులు వాటి గడియలు, తాళం కప్ప, తాళం చెవులను ముట్టుకొంటారు కనుక వాటిని నిత్యం స్పిరిట్ లేదా రికమాండ్ చేయబడిన ద్రావకంతో తుడుచుకోవడం మంచిది.   

12. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకపోయినా కూడా ప్రతీ రెండు గంటలకు సబ్బు, సానిటైజర్ లేదా డెట్టాల్ నీళ్ళతో చేతులు కడుక్కొంటూ ఉండాలి.

13. కరోనా వైరస్ చేతుల ద్వారానే నోరు, ముక్కు, కళ్ళలో నుంచి శరీరంలోకి ప్రవేశిస్తుందని తేలింది కనుక తరచూ చేతులు కడుక్కొంటునప్పటికీ వీలైనంతవరకు మొహాన్ని తాకకుండా ఉంటే మంచిది. 

14. ఇక తప్పనిసరిగా బయటకు వెళ్ళవలసి వచ్చినప్పుడు మగవారైతే ఫుల్ హ్యాండ్స్ చొక్కాలు, ఆడవారైతే చేతులను పూర్తిగా కప్పి ఉండే దుస్తులు ధరించడం మంచిది. తద్వారా ఒకవేళ పొరపాటున కరోనా రోగి నోటి నుంచి తుంపర్లు పడినా ఒంటిపై పడవు. నిజానికి నోస్ మాస్కూలు ధరించడం వలన కంటే దీనితోనే కరోనా సోకాకుండా తప్పించుకోవచ్చు. 

15. బయటకు వెళ్లినప్పుడు ఇతరులకు కనీసం 2 మీటర్ల దూరంలో ఉండటం మంచిది. అలాగే వీలైనంతవరకు బయటై వస్తువులను దేనీనీ తాకరాదు. దుకాణాల వద్ద బల్లలు, కాటాలు, ఫ్రిజ్జులు, బయట నిలిపి ఉంచిన వాహనాలను వేటినీ తాకరాదు. 

16. అపార్టుమెంట్లలో మెట్ల రెయిలింగ్, లిఫ్ట్ తలుపులు, లిఫ్ట్ బటన్లు, లిఫ్టు గోడలపై కరోనా వైరస్ ఉండే అవకాశం ఉంది కనుక ఇంటికి తిరిగి రాగానే బయటే సబ్బు, సానిటైజర్ లేదా డెట్టాల్ నీళ్ళతో చేతులు, పాదాలు శుభ్రంగా కడుక్కొన్నాకే లోపలకు ప్రవేశించాలి. పుల్ల లేదా పెన్నును ఉపయోగించి ఏటీఏం, లిఫ్టు బటన్లను ప్రెస్‌ చేయడం మంచిది. బయటకు వెళ్లినప్పుడు వీలైనంతవరకు ఎడమచేతినే ఉపయోగించడం అలవాటు చేసుకొన్నట్లయితే మొహాన్ని తాకే కుడిచేయి కొంత పరిశుభ్రంగా ఉంటుంది.     

17. బయటకు వెళ్లినప్పుడు ధరించిన బట్టలను, రుమాలు వగైరాలను వెంటనే సబ్బు నీళ్ళలో పడేసి కొంత సేపు తరువాత ఉతుక్కోవడం మంచిది. చెప్పులు, బూట్లతో ఇంట్లోకి ప్రవేశిస్తే కరోనాను ఇంట్లోకి తెచ్చుకొన్నట్లే.  

18. బయటకు వెళ్ళవలసి వచ్చినప్పుడు పర్సు, నగదు, వాచీలు, ఉంగరాలు, గొలుసులు, సెల్ ఫోన్‌ వంటివేవీ పట్టుకెళ్ళకుండా ఉంటే వాటి ద్వారా కరోనా ఇంట్లోకి రాకుండా నివారించవచ్చు. ఒకవేళ తీసుకువెళ్లినా ఇంటికి తిరిగి రాగానే వాటన్నిటినీ స్పిరిట్‌ లేదా ఏదైనా ద్రావకంతో తుడుచుకోవడం అలవాటు చేసుకోవాలి.   వీలైనంతవరకు నగదురహిత లావాదేవీలు జరిపినట్లయితే నోట్లు, నాణేల ద్వారా కరోనా చేతికి అంటకుండా తప్పించుకోవచ్చు. 

కరోనా నుంచి బయటపడటం చాలా కష్టం కానీ అది సోకకుండా తప్పించుకోవచ్చు కనుక వీలైనంతవరకు ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే చాలా మంచిది. కాదని నిర్లక్ష్యంగా తిరిగి కరోనా అంటించుకుంటే, ఒకప్పుడు సమాజంలో కుష్టురోగులను జనాలు ఏవిధంగా హీనంగా చూసేవారో ఇప్పుడు మనల్ని అలాగే చూస్తారు. హైదరాబాద్‌ నుంచి సొంత ఊళ్ళకు రావాలనుకున్నవారినే అనుమతించడం లేదు ఇక మనకు కరోనా సోకినట్లు ఇతరులకు అనుమానం కలిగితే ఏమవుతుందో ఊహించుకోవచ్చు. సామాజిక బహిష్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది.. ఉద్యోగం లేదా ఉపాది కోల్పోయే ప్రమాదం కూడా పొంచి ఉంటుందని మరిచిపోవద్దు.


Related Post