హెచ్ఎండీఏ కృషి ఫలిస్తే ఆ మూడు గ్రామాలు బంగారమే

November 08, 2019


img

హైదరాబాద్‌ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చి నగరంలో స్థిరపడేవారి నానాటికీ సంఖ్య పెరిగిపోతోంది. ఆ కారణంగా నగర శివారు గ్రామాలలోకి రియల్ ఎస్టేట్ రంగం వ్యాపించింది. కనుక శివారు గ్రామాలలో భూములను అభివృద్ధి చేసినట్లయితే అటు రైతులకు, భూయజమానులకు, ఇటు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఆధారిటీ (హెచ్ఎండీఏ)కి లబ్ది కలుగుతుందనే ఆలోచనతో ఇదివరకు ఉప్పల్ భగయత్ లే అవుట్‌ను అభివృద్ధి చేయడం ఇరువర్గాలు లబ్ది పొందాయి. 

అదేవిధంగా ఇప్పుడు మేడ్చల్ జిల్లా ఘాట్ కేసర్ మండలంలో గల ప్రతాప్ సింగారం, కొర్రెముల గ్రామాలలో 1,575 ఎకరాలను, రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి పరిధిలోగల మొకిల గ్రామంలో 456 ఎకరాలను హెచ్ఎండీఏ గుర్తించింది. ఈ మూడు గ్రామాలలో గల 2,000 ఎకరాలను అభివృద్ధి చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

రెండు కుంటల చిన్న పొలం కలిగిన రైతుల మొదలు భారీగా భూములు కలిగినవారు వరకు ఎవరైనా ఈ పధకంలో స్వచ్ఛందంగా చేరవచ్చు. దీనిలో చేరిన రైతులు, భూయజమానులు తమ భూములను హెచ్ఎండీఏకు అప్పగించవలసి ఉంటుంది. అప్పుడు హెచ్ఎండీఏ వాటిని అన్ని విధాలా అభివృద్ధి చేసి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి, వాటికి అన్ని అనుమతులు, దృవీకరణపత్రాలు, యాజమాన్యపు హక్కులతో ఆ భూయజమానులకు తిరిగి అప్పగిస్తుంది. 

భూములను అభివృద్ధి చేసేందుకు భూయజమానులు హెచ్ఎండీఏకి పైసా చెల్లించనవసరం లేదు కానీ ఖర్చుల నిమిత్తం కొంత భూమిని హెచ్ఎండీఏ తీసుకొంటుంది. హెచ్ఎండీఏకి ఏ ప్రదేశంలో, ఎంత భూమిని ఇస్తారనేదానిని బట్టి, ఎంత భూమిని  తిరిగి పొందుతారనేదానిపై ముందే ఒప్పందాలు చేయబడతాయి. అందుకు అంగీకరించినవారి నుంచే భూమిని తీసుకొని అభివృద్ధి చేస్తుంది. కనుక ఇరువర్గాలకు ముందే దీనిపై పూర్తి స్పష్టత ఉంటుంది. కనుక భవిష్యత్‌లో న్యాయవివాదాలకు ఆస్కారం ఉండదు. 

అస్తవ్యస్తంగా ఉన్న భూమిని అన్నివిధాలా అభివృద్ధి చేసి, మౌలికవసతులు కల్పించి, ఖచ్చితమైన డాక్యుమెంట్లు ఏర్పాటు చేసినట్లయితే భూమి విలువ అమాంతం పెరిగిపోతుంది. కనుక ఇరువర్గాలు లాభపడతాయి. అలాగే నగర శివార్లకు అభివృద్ధి వ్యాపిస్తుంటుంది. హెచ్ఎండీఏ చేస్తున్న ఈ కృషి ఫలిస్తే ఆ మూడు గ్రామాలు బంగారమే అవుతాయని చెప్పవచ్చు. 


Related Post