తెలంగాణ ప్రభుత్వానికి మరో సమస్య

November 08, 2019


img

టీఎస్‌ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్నందున ఆర్టీసీ కార్మికులు ఎవరూ విధులలో చేరలేదు. ఇంతవరకు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో ఏదోవిధంగా నెట్టుకొస్తున్నప్పటికీ 50,000 మంది కార్మికులతో నడిచే ఆర్టీసీని 2,000 మందితో నడిపించడం చాలా కష్టమే. అందుకే నవంబర్ 5లోగా ఆర్టీసీ కార్మికులందరూ విధులలో చేరాలని లేకుంటే ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని సిఎం కేసీఆర్‌ హెచ్చరించారు. కానీ ఆ గడువులోగా మరో 3-400 మంది మాత్రమే విధులలో చేరారు మిగిలినవారు సమ్మె కొనసాగిస్తూనే ఉన్నారు. 

ఆర్టీసీ కార్మికులు గడువులోగా విధులలో చేరలేదు కనుక ఆర్టీసీలో 5,100 ప్రైవేట్ బస్సులను ప్రవేశపెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన తాజా పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు సోమవారం వరకు ఆర్టీసీ ప్రయివేటీకరణపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని స్టే విధించింది. 

మోటరువాహనాల చట్టానికి పార్లమెంటు చేసిన సవరణల ఆధారంగా ఆర్టీసీ ప్రయివేటీకరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉందని చట్టం ద్వారా సంక్రమించిన తమ అధికారాన్ని కోర్టులు కూడా ప్రశ్నించలేవని ఇంతవరకు సిఎం కేసీఆర్‌ వాదిస్తున్నారు. కానీ హైకోర్టు స్టే విధించింది.              

గురువారం హైకోర్టులో జరిగిన విచారణలో ఆర్టీసీ విభజన ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని, కనుక దానిని పునర్వ్యవస్థీకరించడానికి వీలులేదని కేంద్రప్రభుత్వం తరపున వాదించిన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్ రావు వాదించగా ఆయనతో హైకోర్టు ఏకీభవించింది. 

ఒకవేళ హైకోర్టు సోమవారం స్టే తొలగించకపోయినా లేదా ఆర్టీసీని పునర్వ్యవస్థీకరించడానికి లేదా ప్రైవేటీకరించడానికి వీలులేదని కేంద్రప్రభుత్వం అభ్యంతరం చెప్పినా తెలంగాణ ప్రభుత్వానికి అన్ని దారులు మూసుకుపోయినట్లే అవుతుంది.

ఒకవేళ ప్రయివేటీకరణ చేయలేకపోతే పూర్తి స్థాయిలో బస్సులను నడిపించలేదు. ఉన్న కొద్దిమంది కార్మికులతో 10,000కు పైగా ఉన్న బస్సులను నడిపించలేదు. అప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపి..వారి డిమాండ్లను పరిష్కరించి...వారిచేత సమ్మె విరమింపజేసి మళ్ళీ ఆర్టీసీని నడిపించుకోక తప్పదు. కనుక ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ ముగిస్తేకానీ ప్రభుత్వం అడుగుముందుకు వేయడం కష్టమే. 


Related Post