అయినా వారి ఉద్యోగాలకు గ్యారెంటీ ఉండదా?

November 04, 2019


img

టిఎస్ఆర్టీసీ కార్మికులు మంగళవారం అర్ధరాత్రిలోగా బేషరతుగా చేరేందుకు వస్తే ఉద్యోగాలలోకి తీసుకొంటామని, వారిని, వారి ఉద్యోగాలను ప్రభుత్వం కాపాడుతుందని సిఎం కేసీఆర్‌ ప్రకటించారు. అలాగే ఆర్టీసీలో 5,100 ప్రైవేట్ బస్సులను ప్రవేశపెట్టడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, ఆ నిర్ణయంలో ఇక ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ఒకవేళ గడువులోగా కార్మికులు బేషరతుగా విధులలో చేరనట్లయితే మిగిలిన రూట్లలో కూడా ప్రైవేట్ బస్సులకు ఇచ్చి వేసి ఆర్టీసీని మూసివేయడానికి వెనుకాడబోమని తేల్చి చెప్పారు. 

ఆర్టీసీలో 5,100 ప్రైవేట్ బస్సులను ప్రవేశపెడుతున్నప్పుడు ఆమేరకు ఆర్టీసీ కార్మికుల అవసరం తగ్గిపోతుందని వేరే చెప్పనవసరం లేదు. కనుక ఒకవేళ సమ్మె చేస్తున్న 48,900 మంది ఆర్టీసీ కార్మికులు బేషరతుగా విధులలో చేరినా వారికి ఆర్టీసీలో పని ఉండదు. బేషరతుగా చేరారు కదా అని ప్రభుత్వం వారిని కూర్చోబెట్టి పోషించదు. వారికి పని ఉండదు కనుక ఉద్యోగాలు ఉంటాయనే నమ్మకం కూడా లేదు. వారిలో అవసరం లేనివారిని స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయమని ఆర్టీసీ యాజమాన్యం ఒత్తిడి చేయవచ్చు. అలాగే రిటైర్ అవుతున్న ఉద్యోగుల స్థానంలో కొత్త ఉద్యోగుల నియామకాలు నిలిపివేయడం ద్వారా ఆర్టీసీలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకొనే ప్రయత్నం చేయవచ్చు.  

నష్టాలు వచ్చే రూట్లను ప్రైవేట్ బస్సులకు, లాభదాయకమైన రూట్లను ఆర్టీసీకి కేటాయిస్తామని సిఎం కేసీఆర్‌ చెపుతున్న మాటలు అసలు నమ్మశక్యంగా లేవు. ఆర్టీసీతో సహా ఏ సంస్థ అయినా లాభాలు రావాలని కోరుకొంటుందే తప్ప నష్టాలు కోరుకోదు కదా?నిజానికి ఆర్టీసీ నష్టాలలో ఉందనే కదా...మూసివేసేందుకు కూడా ప్రభుత్వం వెనుకాడటం లేదు? 

ప్రస్తుతానికి ప్రైవేట్ బస్సులకు నష్టాలు వచ్చే రూట్లను కేటాయించినప్పటికీ, అంతా చల్లబడ్డాక మెల్లగా వాటికి లాభదాయకమైన రూట్లు అప్పగించి ఆర్టీసీకి నష్టాదాయకమైన రూట్లను కేటాయించడం తధ్యం అని ఆర్టీసీ జేఏసీ నేతలు వాదిస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీలో తిరుగుతున్న అద్దె బస్సుల విషయంలో ఆవిధంగానే జరిగిందని మున్ముందు ప్రైవేట్ బస్సులకే ప్రాధాన్య రూట్లను కేటాయించడం ఖాయమని ఆర్టీసీ జేఏసీ నేతలు వాదిస్తున్నారు. అప్పుడు 50 శాతం సొంత బస్సులున్న ఆర్టీసీ ఇంకా నష్టాలలో కూరుకుపోవడం ఖాయం. ఇప్పటికే ఆర్టీసీని ఓ గుదిబండగా భావిస్తున్న ప్రభుత్వం అప్పుడు ఆర్టీసీని మూసేవేయకుండా ఉంటుందా? అప్పుడు మా పరిస్థితి ఏమిటి? అని ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 

కనుక ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగించినా, సమ్మె విరమించి బేషరతుగా ఉద్యోగాలలో చేరినా నష్టపోవడం ఖాయమని స్పష్టం అవుతోంది. ఆర్టీసీ సమ్మెలో కొసమెరుపు ఏమిటంటే, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ఆర్టీసీ కార్మికులు ఉద్యోగభద్రత పొందుదామని ఆశపడితే, ఆర్టీసీ ప్రైవేటీకరణతో వారి ఉద్యోగాలే కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.


Related Post