తెలంగాణలో ప్రతిపక్షాలు ఎప్పటికైనా కోలుకోగలవా?

July 22, 2019


img

ఒకప్పుడు రాష్ట్రంలో...దేశంలో రాజకీయపార్టీలు ప్రజాస్వామ్యానికి లోబడి రాజకీయాలు చేస్తూండేవి కనుక ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ ప్రతిపక్షాలు మనుగడ సాగించగలిగేవి...మళ్ళీ ప్రజలు దయతలిస్తే ఎప్పుడో ఒకప్పుడు అధికారంలోకి రాగలుగుతుండేవి. కానీ ఇప్పుడు ఎక్కడా ఆ పరిస్థితులు లేవు. ఇప్పుడు అంతా పవర్ పాలిటిక్స్... మైండ్ గేమ్స్... ఫిరాయింపుల ట్రెండ్ నడుస్తోంది. అధికారం చేజిక్కించుకోవడం కోసం లేదా నిలుపుకోవడం కోసం రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా ఎవరు ఎన్ని అడ్డదారులు తొక్కుతున్నా వాటిని అడ్డుకోవలసిన రాజ్యాంగ వ్యవస్థలు ప్రేక్షకపాత్రకే పరిమితమవుతున్నాయి. దాంతో రాజకీయవ్యవస్థ నానాటికీ దిగజారిపోతోంది. ప్రస్తుతం తెలంగాణలో కూడా అటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఫిరాయింపుల కారణంగా టిడిపి, కాంగ్రెస్ పార్టీలు బలహీనపడ్డాయి. అవి తమ మనుగడ కాపాడుకోవడం కోసం లేదా ఉనికిని చాటుకోవడం కోసం ఏవో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. కానీ ప్రజలు కూడా వాటిని పట్టించుకోవడం మానేశారు. అంటే ప్రజలు ప్రభుత్వ నిర్ణయాలన్నిటినీ సమర్ధిస్తున్నారనుకోవాలేమో?  

సచివాలయం, ఎర్ర మంజిల్ భవనాల కూల్చివేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీలు ఈనెల 25న ‘ఛలో అసెంబ్లీ’ ఆందోళనకు పిలుపునిచ్చాయి. కాంగ్రెస్‌, టిజేఎస్‌, టిడిపి దీనికి మద్దతు తెలిపాయి. విద్యార్దుల ఫీజు రీ-ఎంబర్స్మెంట్ చెల్లింపులకు, పాఠశాలలు, కాలేజీలు ఆసుపత్రుల భవనాల మరమత్తులకు ప్రభుత్వం వద్ద డబ్బు లేనప్పుడు ధృడంగా ఉన్న భవనాలను కూల్చివేసుకొని వందల కోట్లు ప్రజాధనం ఖర్చు చేసి కొత్త భవనాలు కట్టవలసిన అవసరమేమిటని టిజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయంపై న్యాయపోరాటం కొనసాగిస్తూనే, ఇటువంటి నిరసనలు, ఆందోళన కార్యక్రమాలతో ప్రభుత్వాన్ని నిలదీస్తామని కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ అన్నారు. 

అయితే ప్రతిపక్షాలు చేస్తున్న ఈ పోరాటలతో అవి ఆశిస్తున్న ఫలితం(?) లభిస్తుందా? వారి పోరాటాలతో తెరాస ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చగలరా? వారి పోరాటాలపై ప్రజలు ఏమనుకొంటున్నారు? సమాధానాలు దొరకని ప్రశ్నలివి. అయితే రాజకీయాల స్థాయి, విలువలు తగ్గిపోతున్నకొద్దీ దానికి ముందుగా బలవుతున్నది ఆ రాజకీయనాయకులే కావడం విశేషం. ఇదంతా ప్రజాస్వామ్యాన్ని కాదనుకోవడం వలన జరుగుతున్న అనర్ధాలని చెప్పుకోవచ్చు.


Related Post