మోడీపై భాజపా నేతల పోరాటమా!

January 31, 2018


img

డిల్లీ నుంచి గల్లీ వరకు భాజపా శ్రేణులన్నీ ప్రధాని నరేంద్ర మోడీ భజన చేస్తుంటే, పార్టీలో అత్యంత సీనియర్ నేతలు యశ్వంత్ సిన్హా, శత్రుఘ్నసిన్హా లిద్దరూ మోడీ పాలన బూటకపు గణాంకాలపై ఆధారపడి సాగుతోందని చెప్పడం విశేషం. వారు అంతటితో ఆగితే వారి విమర్శలు గాలికి కొట్టుకు పోయుండేవి. కానీ గతంలో మాజీ కేంద్ర ఆర్ధికమంత్రిగా చేసిన యశ్వంత్ సిన్హా మోడీ సర్కార్ ఆర్ధిక, విదేశాంగ విధానాలను వ్యతిరేకిస్తూ ‘రాష్ట్రీయ మంచ్’ అనే ఒక జాతీయ స్థాయి వేదికను ఏర్పాటు చేశారు. పార్టీలకు అతీతంగా పనిచేసే రాష్ట్రీయ మంచ్ లో భాజపాతో సహా ఏ పార్టీకి చెందినవారైనా చేరవచ్చు. దాని ప్రధానోద్దేశ్యం మోడీ సర్కార్ ఆర్ధిక విధానాలలో లోపాలను ఎండగట్టడం.

మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానాల వలన దేశం తిరోగమన పధంలో పయనించడం మొదలుపెట్టిందని యశ్వంత్ సిన్హా అన్నారు. 70 ఏళ్ళ క్రితం మహాత్మా గాంధీజీని హత్య జరిగినప్పుడు దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉండేవో ఇప్పుడూ అటువంటి పరిస్థితులే ఏర్పడ్డాయని అన్నారు. దేశంలో రైతులు ఆర్ధిక సమస్యలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొంటుంటే, మోడీ సర్కార్ తనకు అనుకూలంగా గణాంకాలు తయారుచేసుకొని, దేశం అభివృద్ధి చెందిపోతోందని చెపుతూ ప్రజలను మభ్యపెడుతోందని అన్నారు. యశ్వంత్ సిన్హా చెప్పిన ఈ మాటలను బట్టి ఆయన మోడీపై యుద్ధం ప్రకటించినట్లే భావించవచ్చు. అయితే, తాము ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి ఈ ఫోరంను ఏర్పాటు చేయలేదని, ప్రభుత్వ లోపాల గురించి చర్చించేందుకు పార్టీలో సరైన వేదిక లేనందునే దీనిని ఏర్పాటు చేయవలసి వచ్చిందని దానిలో చేరిన శత్రుఘ్నసిన్హా చెప్పారు. 

యశ్వంత్ సిన్హా, శత్రుఘ్న సిన్హా చాలా కాలంగా మోడీ సర్కార్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ పార్టీలో వారినెవరూ పట్టించుకోకపోవడంతో, ప్రతిపక్షాల నేతలను కూడగట్టుకొని తమ స్వంత ప్రభుత్వంపైనే ఈ విధంగా యుద్ధం ప్రకటించారు. కనుక వారిరువురినీ భాజపా, ప్రధాని నరేంద్ర మోడీ ఇంక ఎంతో కాలం ఉపేక్షించకపోవచ్చు.


Related Post