తెలంగాణాలో తెదేపాతో భాజపా కటీఫ్ చెప్పలేదు కానీ దానికి దూరమయ్యి ఏడాదిపైనే అయ్యింది. వచ్చే ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేస్తామని రాష్ట్ర భాజపా నేతలు చెపుతున్నారు. ఇప్పుడు ఏపిలో కూడా తెదేపా-భాజపాలు తెగతెంపుల గురించి గట్టిగా మాట్లాడుతున్నాయి. “భాజపాకు అక్కరలేదంటే దానికి ఓ దణ్ణం పెట్టి తప్పుకొంటాము” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు. దానికి భాజపా నేతలు ఏవిధంగా స్పందిస్తున్నారంటే..
భాజపా విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు : పార్టీలు మారిన ఎమ్మెల్యేలను మంత్రులుగా నియమించుకోవడం సిగ్గుచేటు.
చంద్రబాబు నాయుడు: వారికి (భాజపా) మాతో పొత్తులు అవసరం లేదనుకొంటే ఒక దణ్ణం పెట్టి తప్పుకొంటాము. భాజపా ఎప్పుడైనా మిత్రధర్మం పాటించిందా? వారు మాపై ఎన్ని విమర్శలు చేస్తున్నా మావాళ్ళు ప్రతివిమర్శలు చేయకుండా నేను మావాళ్ళను చాలా నియంత్రిస్తున్నాను.
భాజపా నేత సోము వీర్రాజు : తెదేపాతో పొత్తుల విషయంపై మా పార్టీ అధిష్టానం త్వరలోనే స్పందించబోతోంది. ఒకవేళ బాబుకు మాతో పొత్తులు అక్కరలేదనుకొంటే అది అయన ఇష్టం. మేము మిత్రధర్మం పాటించడంలేదని విమర్శిస్తున్న తెదేపా మిత్రధర్మం పాటిస్తోందా? ఈ మూడున్నరేళ్ళలో ఏపిలో జరిగిన ఏ ప్రభుత్వం కార్యక్రమంలోనైనా ప్రధాని నరేంద్ర మోడీ చిత్రాన్ని బ్యానర్ లో పెట్టారా? రాష్ట్రానికి ఇంతగా సహాయసహకారాలు అందిస్తున్న కేంద్రంపై సుప్రీం కోర్టుకు వెళతామని చంద్రబాబు చెప్పడం ఏ రకమైన మిత్రధర్మం? చంద్రబాబు నాయుడుకు నిజంగా దమ్ముంటే మాతో పొత్తులు వదులుకొని చూపాలి.
భాజపా మహిళా నేత పురందేశ్వరి: మిత్రధర్మం గురించి అయన (చంద్రబాబు) మాకు పాఠాలు చెప్పనక్కరలేదు. ఒకవేళ మాతో పొత్తులు వద్దనుకొంటే అదే మాట మా పార్టీ రాష్ట్ర అధినేత కంబంపాటి హరిబాబుకు చెపితే చాలు. కేంద్రం మంజూరుచేస్తున్న పధకాలకు తెదేపా సర్కార్ పేర్లు మార్చి తన పధకాలుగా చెప్పుకోవడం సిగ్గుచేటు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తెదేపా సర్కార్ చర్యలు తీసుకోవడం లేదు కనుక ఆ విషయం గురించి మా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు మేము ఒక లేఖ వ్రాశాము.
తెదేపా-భాజపాల మద్య ఈ స్థాయిలో గతంలో కూడా చాలాసార్లు మాటల యుద్ధాలు జరిగాయి కానీ మళ్ళీ అంతలోనే హటాత్తుగా చల్లారిపోయేవి. మళ్ళీ ఇప్పుడూ అదే జరుగవచ్చు. అయితే ఏపిలో భాజపా-వైకాపాలు మెల్లమెల్లగా దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కనుక ఆ స్నేహం పొత్తులు వరకు వెళుతుందా లేదా అనేది రానున్న రోజులలో అందరూ కళ్ళారా చూడవచ్చు.