తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఏడాది క్రితం నుంచే సర్వే ఫలితాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీ సర్వేలో రాష్ట్రంలో మళ్ళీ తెరాసయే అధికారంలోకి వస్తుందని బల్లగుద్ది చెపుతుంటారు. తెలంగాణాకు నిధుల కొరత లేనందున, రాష్ట్రంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. కనుక కెసిఆర్ సర్వేలలో 75 శాతం అయినా నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏపి సిఎం చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల రెండు ప్రైవేట్ ఏజన్సీలతో సర్వేలు చేయించుకొన్నారని, వాటి నివేదికల ప్రకారం వచ్చే ఎన్నికలలో ఏపిలో మళ్ళీ తెదేపాయే అధికారంలోకి వస్తుందని, 150 సీట్లలో 140-145 సీట్లు గెలుచుకోవడం ఖాయమని ఒక తెదేపా ‘అనుకూల పత్రిక’ ప్రకటించేసింది. ఈ సర్వేలు..వాటి నివేదికలు..వాటిని సమర్ధిస్తూ మీడియా విశ్లేషణలు అంతా బాగానే ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ చేతిలో పనులే కనుక. కానీ వాస్తవ దృక్పధంతో వాస్తవాలను చూసినట్లయితే ఏపిలో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
నిధుల కొరత, కేంద్ర సహాయ నిరాకరణ కారణంగా 2014 ఎన్నికల సమయంలో ప్రకటించిన ఏ పనులును తెదేపా సర్కార్ పూర్తిచేయలేకపోయింది. కనీసం విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం చేత అమలు చేయించలేకపోయింది. ఈ 43 నెలలు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. మౌలికవసతుల కల్పనలో కొంత అభివృద్ధి కనిపిస్తున్నప్పటికీ పారిశ్రామికాభివృద్ధి జరుగనందున ఉపాధి అవకాశాలు పెరగలేదు. ఇవన్నీ తెదేపాకు నష్టం, వైకాపాకు లాభం కలిగించే అంశాలే.
రాష్ట్ర ప్రజలలో ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను జగన్మోహన్ రెడ్డి ఊరూరు తిరుగుతూ ప్రజలను పోగేసి ఇంకా పెంచేందుకు చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి తమను మోసం చేసాయని, కనుక తెదేపాకు ఏకైక ప్రత్యామ్నాయంగా ఉన్న వైకాపాను వచ్చే ఎన్నికలలో గెలిపిస్తే మంత్రదండం తిప్పినట్లు అన్ని సమస్యలను మాయం చేసేస్తానని నమ్మకంగా చెపుతున్నారు. వచ్చే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి కూడా జీవన్మరణ సమస్యవంటివే. కనుక ఎట్టి పరిస్థితులలో గెలిచేందుకు చాలా గట్టి ప్రయత్నాలు చేయడం ఖాయమని చెప్పవచ్చు.
అంటే తెలంగాణాలో తెరాసకునంత అనుకూల రాజకీయ వాతావరణం, ఏపిలో తెదేపాకు లేదని అర్ధం అవుతోంది. కానీ వచ్చే ఎన్నికలలో కూడబలుక్కొన్నట్లుగా రాష్ట్ర ప్రజలందరూ తెదేపాకే ఓట్లేసి గెలిపిస్తారనుకోవడం ఒట్టి భ్రమే అవుతుంది. ఒకవేళ తెదేపా ఆ భ్రమలోనే ఉండదలిస్తే జగన్మోహన్ రెడ్డి దానిని స్వాగతించవచ్చు.